కార్తీక పురాణము 9వ రోజు

విష్ణు దూతలు, యమదూతల వివాదం

9వ అధ్యాయము



           "ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నుండి వచ్చాము. మీ ప్రభువైన యమధర్మ రాజు ఎటువంటి పాపాత్ములను పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలిని పంపారు" అని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు "ఓ విష్ణుదూతలారా! మానవుడు చేసే పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు, రాత్రి, పగలు, సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతి రోజు మాప్రభువు దగరకు వచ్చి చెపుతుంటారు. మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునికి చూపించి ఆ మానవుని మరణసమయంలోమమ్మలిని పంపి రప్పిస్తారు. పాపాత్ములు ఇటువంటి వారో వినండి. 

             వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించే వారు, పరస్త్రీలను కామించేవారు, పరాన్నభుక్కులు, తల్లితండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని, తిట్టి హింసించేవారిని, జీవహింస చేసేవారు, దొంగపధ్ధులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు, శిశుహత్య చేసేవారు, శరణమన్నవారినికూడా వదలకుండా బాధపెటేవారు, చేసినమేలు మరచేవారు, వివాహశుభకార్యాలు జరగనివ్వకుండా అడ్డుతగిలేవారు పాపాత్ములు. వారు మరణించగానే  తన వద్దకు తీసుకు వచ్చి నరకములో పడవేసి దండించమని  యమధర్మరాజు గారి ఆజ్ఞ.

            ఈ  అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకులోనే  కులభ్రష్టుడై  జీవహింసచేసి కామాంధుడై వావివరుసలు మరచి  సంచరించిన పాపాత్ముడు.  వీనిని విష్ణులోకానికి  ఎలా తీసుకువెళతారు. అని యమదూతలు అడిగారు.  విష్ణుదూతలు ఇలా సమాధానమిచ్చారు "ఓ  యమదూతలారా!  మీరు ఎంత అవివేకులు.  మీకు ధర్మసూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మములు అంటే ఏమిటో చెబుతాను వినండి. సజ్జన సహవాసం చేసే వారు జపదానధర్మాలు చేసేవారు. అన్న దానము, కన్యాదానము, సాలగ్రామదానము చేసేవారు.   అనాధ శవాలకు దహనసంస్కారాలు చేసేవారు.  తులసి వనము పెంచేవారు. చెరువులను తవ్వించేరు.  శివకేశవులను పూజించేవారు. సదా హరినామస్మరణ చేసేవారు. మరణసమయంలో 'నారాయణ' అని శ్రీహరిని గాని 'శివ' అని శివుని గాని స్మరించేవారు.  తెలిసి గాని తెలియక గాని హరినామస్మరణ చెప్పిన వినిన వారు పుణ్యాత్ములు. కాబట్టి అజామిళుడు ఎంతటి పాపాత్ముడైన మరణ సమయంలో 'నారాయణ' అని స్మరిస్తూ మరణించాడు కాబట్టి మేము వైకుంఠమునకు తీసుకొని పోతాము"  అని పలికారు.

       అజామిళుడు  విష్ణుదూతలు, యమదూతల సంభాషణ విని ఆశ్చర్యంపొంది " విష్ణుదూతలారా! పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము గాని ధర్మములు గాని చేయలేదు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు ఎప్పుడూ నమస్కారం చేయలేదు. వర్ణ  ఆశ్రమాలు విడిచి కులభ్రష్టుడిని అయ్యాను.  నీచకుల కాంతలతో సంసారం చేశాను.  నా పుత్రుని ఎందున్న ప్రేమించే 'నారాయణ' అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోతున్నారు.  నేను ఎంత అదృష్టవంతుడిని నా పూర్వజన్మసుకృతం! నా తల్లిదండ్రుల పుణ్యఫలము నన్ను రక్షించింది"  అని చెప్పి సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లెను.

          జనకమహారాజా! తెలిసి గాని తెలియక గాని నిప్పు తగిలిన  దహిస్తుందో అలాగే శ్రీ హరి నామస్మరణ చేసిన సకల పాపములు నశించి మోక్షము కలుగుతుంది ఇది ముమ్మాటికి నిజం.

          ఇంకావుంది.......................... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...