శ్రీకృష్ణ ఉద్దవుడి సంభాషణ 2



ఇంకొక విశేషమైన పురాతన పుణ్యకథ చెప్తాను, విను. కనకావతీనగరంలో ఒక ఉత్తమమైన బ్రాహ్మణ కన్యక ఉంది. ఆ కాంతారత్నం తన చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించేది. ఒకనాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. వారికి వండిపెట్టాలి అని బియ్యం కోసం వడ్లు ఇంట్లో రోకలితో వడ్లు దంచుతూ ఉంటే, ఆమె కంకణాలు గల్లుగల్లు మని చప్పుడు చేయసాగాయి. ఆ చప్పుడుకు చీకాకు పడింది. అందుకని, ఆ పరమపతివ్రత చేతికి ఒక్క గాజు మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేసి అవతల పెట్టి, చప్పుడు కాకుండా తన పని పూర్తిచేసుకుంది. అలాగే తత్తరపడక భగవంతుడికి అర్పించిన ఏకాగ్రమైన చిత్తంతో ప్రసన్న మనస్కులై మానవులు ముక్తులవుతారు. కనుక అవిద్య విద్య రెండు నా మాయగా తెలుసుకుని కేవలం పశుమార్గులు కాకుండా ఐశ్వర్యం వీర్యం యశస్సు జ్ఞానం సిరి వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరుల లాగా, సుఖాన్ని కోరకుండా ఉండే వాళ్ళు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయ అని గ్రహించు.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అప్పుడు అతను. “దేవా! నీ రూపాన్ని ఎలా చూడగలము.” అని అడిగాడు

అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఉద్ధవా! భక్తిభావన యందు ఆసక్తి, దయారసము కలిగి; మితభాషణుడై, అబద్ధమాడక, సమస్త కర్మలు మదర్పణంగా చేసేవాడు భాగవతుడు అనబడతాడు. నా కథలు, నా జననం, నా లీలావిలాసాలు వింటూ నా సేవకులైన భాగవతులను తిలకించి. తమ ఇంటికి తీసుకుని వెళ్ళి, పూజించి స్నాన భోజన శయనాసనాదులతో వారిని సంతృప్తిపరచిన వాడు కూడ భాగవతుడు అనబడతాడు. చివరికి, జీవితాంత కాలం ఇదే విధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో నివసిస్తాడు.

అదీకాక శంఖచక్రగదాధరుడను, లక్ష్మీ సమేతుడను అయిన నన్ను; శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమరుపాటు రాకుండా గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ధ్యానిస్తూ శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు; అంబరీషుడు, విభీషుణుడు, రుక్మాంగదుడు మున్నగు భాగవతులు తెలుసుకున్నారు. మధురాపురానికి బలరాముడితో కలసి నేను వెళ్ళగా నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తియోగంతో నన్నే చింతించి ముక్తిపొందారు. ఇది భక్తి యోగ వివరం.” అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. “ఓ ఉదాత్తచరిత్రా! ధ్యానం ఎలా నిలుబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు.” అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “కఱ్ఱ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా, సకల శరీరాలలోను అచ్ఛేద్యుడు అదాహ్యుడు అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు.” అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. “సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు.” అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడ తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్ళకు చెప్పాను. ఆ వివరం చెప్తాను శ్రద్ధగా విను.

పంచేంద్రియాలకూ కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి, సంసార మందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది, నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్ధం నిజం కానట్లుగా, కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది. అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి, నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా, నా మీద భక్తి ఆసక్తికలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు; శంఖమూ చక్రమూమొదలైన ముద్రలను ధరించేవాడు; హరిదివ్యనామాలు ధరించేవారికీ అన్నమూ నీళ్ళూ ఇచ్చేవాడు; విష్ణుభక్తులను కాంచి సంతోషించేవాడు కూడ భాగవతుడు అని తెలియుము. అన్ని సంగాలను వదలి, ఇతరము ఎరుగక, నన్నేతలచే మానవునకు భుక్తినీ, ముక్తినీ ఇస్తాను.” అని బోధించాడు. అంత, ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్ప మని మళ్ళీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు.

“ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని, ముక్కు చివర చూపు నిలిపి, ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి. పద్దెనిమిది విధాల ధారణా యోగసిద్ధులను తెలుసుకుని, అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను పరమాత్మతో లగ్నంచేసి, బ్రహ్మపదాన్మి పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు.

ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది, ఇలానే అడిగితే, అతనికి చెప్పిందే నీకూ చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా, నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుఱ్ఱములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వర్ణములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించాడు. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు. కమలలోచనా! చతుర్వర్ణములు చతురాశ్రమములు వాటి ధర్మములు నిర్ణయించి చెవులకింపు అయ్యేలా చెప్పు వింటాను.” ఇలా అడిగిన ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు నాలుగు వర్ణాల పుట్టుక; నాలుగు ఆశ్రమాలకూ తగిన పద్ధతులు; నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలు; ప్రవృత్తి నివృత్తి హేతువులయిన పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు; వైరాగ్య విజ్ఞానములు; మొదలైనవన్నీ తెలిపాడు. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” ధర్మంబులు సకలం విడిచి నన్నొక్కనినే శరణు పొందు అనే ఉపనిషత్తులతో సమానమయిన గీతాప్రవచనం ప్రకారం. నాయందు మనస్సు కలిగి ప్రవర్తించేవాడు నేనని చెప్పబడతాడు. పలువిధాలైన వాదాలెందుకు అతరత్రా మనస్సు లగ్నం కానీయకుండా, నామీదనే తలపు కలిగి నడచుకో. అనగా ఉద్ధవుడు ఇలా అన్నాడు. శ్రీకృష్ణా! తెలియనివి కొన్ని చెప్పావు. ఇంకా తెలియవలసినవి ఏవైనా ఉంటే తెలుపు. వాటిని తెలుసుకుని కృతార్ధుడను అవుతాను.” ఇలా ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “ఉద్ధవా! నీ ప్రశ్నలు సామాన్య మైనవి కావు. అయినా విను, చెప్తాను. యమ నియమాలూ శమదమాలు మొదలైనవి ఏవి? తపమనగా ఏమి? సుఖదుఃఖాలు స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు అంటే ఎట్టివాడు? ఈశ్వరు డంటే ఎవరు? అని నీవు అడిగిన విషయాలన్నీ విడివిడిగా వివరిస్తాను.

మౌనవ్రతము, బ్రహ్మచర్యము, ఓర్పు, జపము, తపము, అతిధులను సత్కరించుట, పరహితము, దొంగతనమూ మొదలైనవి లేకుండుట, ఇటువంటివి నియమాలు అనబడతాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం, శత్రువులందు మిత్రులందు సమభావంతో ఉండటం శమము. మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించటము, కోరికలను వదలటం, సమదర్సనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం వీటిని విద్య అంటారు. శమదమాది గుణాలు లేకపోవటం, నామీద భక్తి లేకపోవటం, అవిద్య అంటారు, చిత్తశుద్ధి కలిగి ఎప్పుడు తృప్తిగా ఉండటం దమము. ఇటువంటి నియమాలు గుణాలు కలిగి, నామీద భక్తి కలిగి ఉండటమే సుఖము. నన్ను తెలుసుకోలేక తమోగుణముతో ఉండటమే దుఃఖము. బంధువులందు గురువులందు భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను జయించి గుణసంగములలో విరక్తుడైన వాడే ఈశ్వరుడు.

నా మీద మనసును నిలిపి కర్మయోగమందు, భక్తియోగమందు అభిమానం కలిగిన జనక మహారాజు మొదలైన వాళ్ళు మోక్షం పొందారు. భక్తియోగం సాధించి బలి, ప్రహ్లాదుడు, ముచుకుందుడు మున్నగువారు పరమపదాన్ని పొందారు. కనుక, ఈ విషయాల్ని తెలుసుకుని ఎప్పుడూ భక్తియోగాన్ని ఎక్కువగా నీ మనసులో నింపుకో. మట్టికుండకు చిల్లుపడితే నీళ్ళు కారిపోవునట్లు దినదినము ఆయువు తరిగిపోతూ చావు దగ్గరపడుతు ఉంటుంది. కాబట్టి, ఇది ఎరిగి ఎప్పుడూ ఏమరక నన్ను స్మరిస్తూ ఉండేవాడు, నాకు ప్రియుడు. ఉద్ధవా! గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కడుపులోంచి భూమిమీద పడగానే ఆ జ్ఞానమంతా పోతుంది. అందుచేత, మానవుడు పసివానిగా కాని, పిల్లవానిగా కాని, యువకునిగ కాని, పెద్దవాడు అయిన పిమ్మట కాని నన్ను తెలుసుకుంటే కృతార్థుడు అవుతాడు. సంపదలు ఉన్నాయని గర్వంతో గ్రుడ్డివాడు అయితే చీకటిబావిలో పడతాడు. అటువంటివాడిని దరిద్రునిగా చేస్తే, జ్ఞాని అయి నా పాదపద్మాలకు నమస్కరించాలనే అభిలాష కలుగుతుంది. మోక్షం పొందుతాడు. శరీరము మీద అభిమానము వదలి ఈ లోకానికి పరలోకానికి చెందిన సుఖాలను కోరక మనస్సును నిగ్రహించుకొని, ఎల్లవేళలా నన్ను స్మరించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. నేనూ అతనిని విడచిపెట్టలేక వాని వెనువెంటనే వెళ్ళుతుంటాను. నారదుడు మున్నగు మునులు భక్తిభావం వలన నా సారూప్యం పొందారు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడు మరల ఇలా అన్నాడు. స్వామీ! దేవదేవా! వాసుదేవా! జనార్ధనా! నీవు సర్వజ్ఞుడవు. సృష్టికర్తను ఎవరు నేర్పుతో నడుపుతాడో ఆనతీయవలసింది. అనగా శ్రీహరి ఉద్ధవుడితో ఇలా అన్నాడు. “ఆవిధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక అండంగా ఏర్పడ్డాయి; ఆ అండం నుంచి నేను పుట్టాను; అంతట నా నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచ మంతా అతని చేత నేనే నిర్మింప చేసాను. ఆ బ్రహ్మదేవుడికి నూరేండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది; గంధం నీటిలో కలుస్తుంది; ఆ నీరు రసములో లీనమవుతుంది; ఆ రసం తేజస్సు రూపాన్ని ధరిస్తుంది; ఆ తేజస్సు రూపము నందు సంక్రమిస్తుంది; ఆ రూపం వాయువులో కలుస్తుంది; ఆ వాయువు స్పర్శగా మారుతుంది; ఆ స్పర్శగుణం ఆకాశంలో లయమవుతుంది; ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే లోగొనబడుతుంది; ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వర రూపాన్ని ధరిస్తాయి.

భగవంతుడనైన నేను రజస్సు సత్త్వము తమస్సు అనే మూడు గుణాలతోకూడి మూడుమూర్తులు ధరించి సృష్టి పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికి కారణుడై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. కాబట్టి, పరమ పావనుడవు పరమ భక్తియుక్తుడవు కావలసింది.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పాడు. మళ్ళీ ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో రూపంలేని నీకు యోగులు ఒక ఆకారాన్ని రూఢీగా నిలిపి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు వారి కోరికలు ఎలా తీరుస్తావు. నాకు తెలుపుము. ఉద్ధవుడు ఇలా అడుగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నేను అన్ని వర్ణాలవారు అనుసరించ తగ్గ పూజా పద్ధతి చెప్తాను, విను. రాతితో కాని, మట్టితో కానీ, కొయ్యతో కానీ తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరుపెట్టి కొందరు పూజిస్తారు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చేసిన ప్రతిమలు శ్రేష్ఠమైనవి. ఈవిధంగా నా ప్రతిరూపాలలో నా భావాన్ని ఉంచి కొలచిన వారికి, నేను ప్రసన్నుడను అవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు కనుక, ఎన్నో విధాలుగా ఉండే దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో నేను ప్రసన్నుడనై ఉంటాను. కాబట్టి, క్షీరసాగరంలో పడుకున్నవానిగా భావించి; శుభ్రమైన వస్త్రాలను, ఆభరణాలను, పూలదండలను, మైపూతలను అర్పించి దివ్యమైన అన్నపానాలు, షోడశోపచారాలతో రాజోపచారాలు, బాహ్యమైన పూజలు చేసి నాకిష్టమైన పదార్ధాలను సమర్పించి కానీ; లేదా ప్రతిదినము మానసిక పూజాపద్దతులతో కాని సంతుష్టి పరచి నన్ను దివ్యమైన వస్త్రాలు, భూషణాలు పూలదండలు ధరించి ప్రకాశిస్తూ; శంఖము, చక్రము, కిరీటము, మొదలైన వానితో అలంకృతుడనైన మంగళవిగ్రహునిగా భావించి ధ్యానపరవశుడు అగు నా భక్తుడు నా యందు కలుస్తాడు. ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రతరమైన యోగనిష్ఠతో బదరికాశ్రమం చేరు. నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకుని కలియుగం చివరి దాకా ఉండు.” అని పరమేశ్వరుడు ఆనతీయగా ఉద్ధవుడు మనసు నిండా ఆనందం పొంగిపొర్లింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయాన చేర్చుకుని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తునకు చెప్పాడు.



శ్రీకృష్ణుడు ఉదవుడి సంభాషణ 1

 


ఒకరోజు సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. అలా వచ్చిశ్రీకృష్ణుడిని దర్శించుకుని పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో స్తుతించారు.సర్వలోకాధినాథ! సర్వేశ్వర! పుట్టుక లేని వాడ! నీవు భూలోకంలో పుట్టడము, భూభారం తగ్గించటం కోసం కదా. నీవు జన్మించి ఇప్పటికి నూటఇరవైఐదు సంవత్సరములు గడిచాయి. ఇక చాలు వైకుంఠభవనానికి వేంచేయి స్వామి అంటూ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగు సమస్త దేవతలు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించిన హరి, వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాలు కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి యిదే వస్తాను. మీరు వెళ్ళండి” అని చెప్పి వాళ్ళందరికి వీడ్కొలు ఇచ్చాడు. ఆ బ్రహ్మాదేవుడు మున్నగు దేవతలు తమతమ స్థానాలకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు యాదవును ఇలా హెచ్చరించాడు. “ఓ యాదవులార! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు అనేక రకాలుగా ఏడుస్తున్నాయి. గుఱ్ఱపుతోకలకు మంటలు పుడుతున్నాయి. చిలుకలు గోరువంకలు రాత్రిపూట వికృతస్వరాలతో అరుస్తున్నాయి. ఒక జంతువు మరొక జాతి జంతువును కంటున్నది, పౌరుల నివాసగృహాలలో మిణుగుఱులు పుడుతున్నాయి. సూర్యబింబాన్ని కావిరి కమ్ముకుంటోంది. ఇలా చాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. కనుక, మీరంతా ఇక్కడ ఉండద్దు. శీఘ్రమే ప్రభాసతీర్థానికి వెళ్ళండి.” అని కృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్యా బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులు గుఱ్ఱాలు సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాసతీర్థానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఒకసారి తాను అవతారం చలించే ముందు ఉదవుడికి ధర్మాబోధ చేస్తాను అని మాట ఇచ్చారు. అందుకని శ్రీకృష్ణుడు ఉదవుడిని తీసుకొని ద్వారకా దగ్గరలోనికి వెళతారు. ఉద్దవుడు ఈ విషయాన్ని గ్రహించి స్వామి తమని వదిలి వెళతారు అని తెలుసుకొని ఏడుస్తు శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతించి “ఓ దేవా! నీవు యాదవజాతిని నాశనంచేసి వెళ్ళిపోతే, మేము ఎలా మా జీవితాలు నిర్వహించగలము. నీకు సహచరులమై నీతో కలసి చేసిన స్నాన పాన భోజన శయన ఆసనాదులను ఎలా మరచిపోగలము.” అని ఉద్ధవుడు అన్నాడు. దానికి వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “బ్రహ్మదేవుడు మొదలగు దేవతల ప్రార్థన ప్రకారం భూభారాన్ని తొలగించాను. ఇక ఈనాటి నుండి ఏడవ దినమున ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం ప్రవేశిస్తుంది.
అప్పుడు మానవులు ధర్మం ఆచారం లేనివారు అవుతారు. అంతేకాక మానవులు అన్యాయపరులు, అతిరోష స్వభావులు, బహురోగ పీడితులు, సంకల్పాలు ఫలించని వారు, నాస్తికులు అయి ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోకుండ ఉంటారు. కనుక, నీవు స్నేహితులు చుట్టాలు వంటి అనుబంధాలను వర్జించు. ఇంద్రియ సౌఖ్యాలలో మునిగిపోకు. భూతలం మీద పుణ్యతీర్ధాలలో స్నానాలు చెయ్యి. పంచేంద్రియాలచే గ్రహింపదగు వస్తువులు సర్వం నశించేవిగా తెలుసుకో.
పురుషుడు అనేకామైన సంపదలను సంపాదించి కామాలకు అవకాశమిచ్చి తన గుణదోషాలకు మోహితుడు అయి ఉంటాడు. కాబట్టి, మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా, ఇంద్రియాలను మనోవికారాలను నిగ్రహించి భార్యాపుత్రులపైన ధనముపైన ఆసక్తి వదలుము. సుఖమునందు కష్టమునందు సమంగా వర్తించు. ఈ విశ్వం సమస్తం పరమాత్మచే అధిష్టించబడినదిగా గ్రహించు. మాయ ఆత్మకు వశమైనదిగా గుర్తించు. జ్ఞాన విజ్ఞానములు కలవాడవు అయి, అత్మానుభవంతో సంతుష్టిపొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు.” అని వాసుదేవుడు అనతిచ్చాడు.
ఉద్ధవుడు భయ భక్తి వినయాలతో చేతులు జోడించి ఇలా అన్నాడు. “మహానుభావ! సన్యాస జీవితం చాల కష్టమైంది. పామరులు ఆచరించ లేరు. నీ మాయ వలన భ్రాంతులు అయినవారు ఈ సంసార సముద్రాన్ని ఎలా తరించగలరు. ఎలా మోక్షాన్ని పొందగలరు. నేను మీ సేవకుడను కదా. నాకు దయచేసి సెలవియ్యండి. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు సహితం బాహ్య వస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. నీ భక్తులైన పరమ భాగవతులు మాత్రమే ఆ మాయను తప్పించుకో గలరు. ఇల్లాండ్రకైనా, గృహస్థులకైనా, యతులకైనా ఎప్పుడూ నీ నామస్మరణమే మోక్షసామ్రాజ్యాన్ని అందిస్తుంది. కాబట్టి, పరమేశ్వరా! నీ పాదాలను శరణు వేడుతున్నాను. నా మీద నీ దయారసాన్ని ప్రసరించు.” అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు అర్థించాడు. అప్పుడు అతనితో కృష్ణుడు ఇలా అన్నాడు.
మానవుని ఆత్మకు ఆత్మే గురువు అని తెలుసుకో. చెడుమార్గాలలో వెళ్లకుండా సన్మార్గంలో మెలగుతూ పరమమైన నా నివాసానికి చేరుకో. సమస్తానికి మూలమైన నన్ను సాంఖ్య యోగులు ఎప్పుడు పరమపురుష భావంతో భావిస్తూ ఉంటారు. అదీకాక ఒకటి రెండు మూడు నాలుగు అనేక కాళ్ళు కలవి; అసలు కాళ్ళులేనివి అయిన జీవజాలంలో రెండు కాళ్ళు కల మనుష్యులు ఉత్తములు; వాళ్ళలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు; కాని వాళ్ళలో సంశయగ్రస్తులు నన్ను గ్రహించలేరు; నేను సత్త్వగుణగ్రాహ్యుడను. ఈ విషయం గ్రహించి తమ మనసులలో జీవాత్మ పరమాత్మలను ఒకటి చేసి. శంఖం చక్రం గద ఖడ్గం శార్గ్ఞ్యం కౌమోదకి కౌస్తుభం మున్నగు ఆభరణాలు కల నన్ను తెలుసుకున్న వారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు.” అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. “అవధూత యదుసంవాదం అనే ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది. చెప్తాను విను.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. “ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడినుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరిగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాదచేసి “ఎక్కడ నుండి వచ్చారు” అని ఆసక్తితో అడిగాడు. యోగి ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు ఇరవైనలుగురు నాకు గురువులు. వారివలన నేను విజ్ఞానిని అయినాను.” అని యోగి అనగా దానికి యదురాజు “శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏవిధంగా విష్ణువును చేరగలడు. తెలియజెప్పండి.” అంటే, అవధూత ఇలా అన్నాడు. సచ్ఛరిత్రా! విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైనపడి రోగాలు పుట్టక ముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాక ముందే, గొంతులో శ్లేష్మం చేరక ముందే, శక్తియుక్తులు సన్నగిల్లక ముందే, ధృఢమైన భక్తిభావనతో దానవాంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త ఙ్ఞానం కలిగి ఉండి, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు. భార్యాబిడ్డలపై, ధనధాన్యములపై అతి మోహం పెంచుకునే మానవుడు, భయంకరమైన వియోగ దుఃఖాలలో కొట్టుమిట్టాడతాడు. ఏమి చేయాలో తెలియని స్థితికి చేరతాడు. ఆ బంధాలలో చిక్కుకుపోయి నీతి, వివేకాలు కోల్పోతాడు. ఆఖరికి కథలోని కపోతము వలె మనోవ్యథతో తప్పక నష్టపోతాడు. దీనికి ఒక ఇతిహాసము ఉంది. చెప్తా విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆ కపోత దంపతులు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉండేవారు. కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలన్నీ అటుఇటూ తిరుగుతూ ఉంటే సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్నినెలలు గడిచాయి. ఇలా ఉండగా, ఒకనాడు కాలవశాన ఒక బోయ వచ్చి వల వేశాడు. ఆ వలలో ఆడపావురము పిల్లలు చిక్కుకున్నాయి. మగపావురం ధైర్యం వదలి మోహంతో భార్యా బిడ్డలమీద స్నేహంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించి పోయింది. కాబట్టి, దేని యందు మరీ తీవ్రమయిన మోహం మంచిది కాదు.
అందుకనే యోగీంద్రులు ఎప్పుడు హరిధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుమికిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ (ఇరవై నాలుగు) మొదలగు వాటి గుణగణాలు తెలుసుకుని మెలగుతూ ఉంటారు.” ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా, “ఇవి ఏమిటో తెలుసుకోవాలని ఉంది, నిర్మలమతితో వీటి గురించి తెలియచెప్పండి.” అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ఈ విధంగా, 1. భూమివలన సహనము; 2. వాయువువలన పరోపకారము; 3. ఆకాశమువలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం; 4 నీటివలన ఎప్పుడు శుచిగా ఉండటం; 5. అగ్నివలన నిర్మలంగా ఉండటం; 6. 7. చంద్ర, సూర్యులవలన సర్వసమత్వము; 8. పావురంవలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము; 9. కొండచిలువవలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం; 10. సముద్రంవలన ఉత్సాహ రోషములు; 11. మిడుతవలన శక్తికి తగిన పనిచేయటము; 12. తుమ్మెదవలన సారమును మాత్రమే గ్రహించటం; 13. ఏనుగువలన స్త్రీ వైముఖ్యము; 14. తేనెటీగవలన సంగ్రహణము; 15. లేడివలన విచారపరత్వమ; 16. తాబేలువలన జిహ్వాచాపల్యము; 17. ముంగిసవలన దొరికిన దానితో తృప్తిపడటం; 18. లకుమికిపిట్టవలన మోహ పరిత్యాగము; 19. బాలునివలన విచార పరిత్యాగము; 20. బాలికవలన సంగ విసర్జనము; 21. బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత; 22. పామువలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం; 23. సాలెపురుగువలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము; 24. కందిరీగవలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట; నేర్చుకోవాలి.
ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, అనే అరిషడ్వర్గము (ఆరుగురు శత్రువులు) జయించాలి ముసలితనం రాకుండా చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలగి, పట్టణాలను గ్రామాలను నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్నీ మోహాన్నీ వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్ఠతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు నా యందే కలుస్తాడు. మోహానికి వశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయే వాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు. దీనికొక ప్రాచీన కథ ఉంది. శ్రద్ధగా విను. మిథిలానగరంలో పింగళ అనే వేశ్యామణి ఉంది. ఆమె వలన కొంత పరిఙ్ఞానాన్ని పొందాను. ఎలాగ అంటే, ఆ వనిత డబ్బుమీది ఆశతో తన ప్రియుడిని మోసపుచ్చి ధనమిచ్చే మరొక విటుడిని మరిగింది. వాడిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వాడితో రాత్రిళ్ళు నిద్రలేకుండా ఊర్లమ్మట, వీధులమ్మట విహరించింది. నిద్ర లేకపోవటం వలన బాగా నీరసించింది. ధనకాంక్షతో తిరిగితిరిగి అలసిపోయింది. చివరకు ఆత్మసుఖం కలిగించేవాడే భర్త అని గ్రహించుకుంది. నారాయణుడిని కనుక ఇలా చింతిస్తే కైవల్యాన్ని చెందగలను కదా, అని విచారించింది. తన శయన గృహాన్ని, సమస్త సంపదలను త్యజించింది. వాసుదేవుడి పాదపద్మాలకు నమస్కరించి తరించాలనే అభిలాష కలిగినదై, శరీరం మెరుపులా అశాశ్వతమైన దని నిశ్చయించుకుంది. పరతత్వం మీద మనస్సు లగ్నంచేసుకుని, ముక్తురాలైంది. అని శ్రీకృష్ణుడు వివరించాడు. ఉద్ధవా! దేహం శాశ్వతమైనది కాదని గ్రహించి, మోహాన్ని కత్తిరించి పారేసి, సిద్ధులు మునులు చరించే మార్గాన్ని అనుసరించి, సంసారం వదలిన మానవుడు మోక్షలక్ష్మిని పొందుతాడు.


యదువంశానికి బ్రాహ్మణ శాపం

శ్రీమహవిష్ణువు వలన వదించబడిన రాక్షసులు అనేక మంది ద్వాపర యుగంలో జన్మించి రాజులై ప్రజలను మునులను భాదించసాగారు. భూభారాన్ని తగించటానికి అవతరించిన శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండే రాక్షస సంహారం మొదలుపెట్టారు. తరువాత మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత జూదక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు. మునీశ్వరులు, ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు, మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధిచెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు. దుర్మదాందులైన రాజులను మర్దించి, కంసుడు మొదలైనవారిని సంహరించి భూమికి బరువును తగ్గించి నందనందనుడు దేవతలందరూ తనను కొలుస్తుండగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా శ్రీకృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదుసైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితి వచ్చింది. ఇలా మహానుభావుడైన శ్రీకృష్ణుడు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను, చాణూర, ముష్టికులను, కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవసైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులువీరి గోలోకంలోని వారు. నా ఆజ్ఞ తో భూలోకంలో జన్మించారు. వీరు ఇతరుల వలన ఓటమి లేని వారు అయ్యారు. భూలోకంలో ఉన్న మాయ వలన వీరికి తమను జయించేవారు లేరు అని అహంకారం వచ్చింది. వీరు జన్మించిన కారణం మరచి పోయారు. వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు. నేను అవతారం చలించే ముందు వీరిని సంహారించి తిరిగి గోలోకానికి పంపాలి వీరిని ఇక్కడే వదిలి వెళితే అహంకారంతో అమాయక ప్రజలను పిడించటం మొదలు పెడతారు అని ఆలోచించాడు. సాటిలేని అందమైన తనువు దాల్చి సకల కర్మల యందు ఆసక్తికలవాడై పరమేశ్వరుడైన కృష్ణుడు యాదవులను అణచవలెనని సంకల్పించిన సమయాన జటావల్కలములు కమండలములు ధరించి, నల్లజింకతోలు కట్టుకున్న వారు, రుద్రాక్షలు వీభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు, వాఖిల్యులు, అత్రి, వశిష్టుడు, నారదుడు మున్నగు మునిశ్రేష్ఠులు స్వేచ్ఛావిహారం చేస్తూ ద్వారకానగరానికి విచ్చేసారు. శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేసాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులైన్నారు. అప్పుడు కృష్ణుడిని మునిశ్వరులు అనేక విధాలుగా స్తుతించారు. నా ధ్యాన నామస్మరణలు పునర్జన్మలు అనే భవరోగాలను హరిస్తాయి. బ్రహ్మ రుద్రుడు మొదలైన వారందరికి శరణమైనవి. సకల మంగళ ప్రదములు. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను.” అని యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చి “మీరిక్కడికి ఎందుకు వచ్చారు.” అని అడిగాడు. అందుకు వారు “మీ పాదపద్మాలను దర్శించుట కంటే వేరే విశేషము ఏముంటుంది.” అని పలికి, వాసుదేవుని వద్ద సెలవు తీసుకొని ద్వారకకు దగ్గరలోని పిండారకము అనే పుణ్యతీర్ధానికి వెళ్ళారు. అప్పుడు మునిశ్వరులను చూసిన యాదవ బాలకులలో కొందరు అహంకారం తో తమ నేర్పుతో సాంబుడికి అందమైన స్త్రీవేషం వేసారు. యాదవబాలురు గుంపులు గుంపులుగా చేరి తుళ్ళింతలతో, నవ్వులతో, కేరింతలతో ఆడవేషం వేసిన సాంబుడిని ముందుంచుకుని వెళ్ళారు. మునిసమూహానికి సాగిలపడి మ్రొక్కారు. “ప్రస్ఫుటముగా కనపడుతున్న గర్భం కల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడా ఆడపిల్ల ఉందా చెప్పండి?” అని ఆ మునులను అడిగారు. వారి అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది. యాదవబాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా “ఇలా హాస్యాలు చేయొచ్చా?” అని అంటూ యదువంశాన్ని నాశనం చేసే రోకలి (ముసలం) ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది ఆలస్యం కాదు. ఇక పొండి.” అని పలికారు. గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవబాలురు మునుల శాపం విని భయపడి వడ వడ వణుకుతూ సాంబుడి పొట్టచుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేల మీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడ, ఏమి తెలియనివాడిలా వాళ్ళతో వాసుదేవుడు ఇలా అన్నాడు. మీ బుద్ధి చెడిపోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెఱ్ఱివాళ్ళు ఎవరైనా ఉంటారా  అనుభవించండి.బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటి వారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించుటం ఎవరికి సాధ్యం కాదు కదా. అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు.” ఇలా పలికి వాసుదేవుడు వాళ్ళను ఇలా ఆఙ్ఞాపించాడు. “సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవూ వెడల్పూ గల పెద్దబండ మీద మీ భుజబలాలు వాడి, ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి.” అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడిచేసి సముద్రంలో కలిపి. మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక, అరగదీయుట ఆపి, సముద్రంలో పడవేశారు. దానిని ఒకచేప మ్రింగింది దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం చివర ములికిగా మలచుకున్నాడు.

మరణించిన బ్రాహ్మణ కుమారులను తీసుకురావటానికి వైకుంఠం వెళ్లిన శ్రీకృష్ణార్జునులు

 శ్రీకృష్ణుడు ద్వారకాలో సుఖంగా ఉంటున్న రోజులలో, ఒక విప్రుని భార్యకు పుత్రుడు పుట్టి పుట్టగానే చనిపోయాడు. శోకంతో కన్నీళ్ళు పెట్టుకుని మృతబాలుడిని ఎత్తుకుని వచ్చి, ఆ బాలుడి శవాన్ని రాజద్వారం ముందు పెట్టి, విధిని నిందిస్తూ, తనను తాను తిట్టుకుంటూ, బ్రాహ్మణుడు గుండెబ్రద్దలయ్యేలా “అయ్యో” అంటూ దుఃఖించసాగాడు. దుర్భరశోకంతో కుమిలిపోతున్న ఆ విప్రుడు అక్కడి ప్రజలతో “బ్రాహ్మణద్వేషి, శాస్త్రాచారాన్ని పాటించని వాడు, పాపాత్ముడు అయిన క్షత్రబంధువు చేసిన పాపం వలన నా కుమారుడు పుట్టగానే చచ్చిపోయాడు. దేశాన్ని ఏలే రాజు హింసను ఏవగించుకోకుండా, న్యాయానికి దూరుడు, ఇంద్రియలోలుడు అయితే ఆ ప్రజలు నిరాశతో దుఃఖాలవలన అధికమైన కష్టాలను పొందుతారు.” అని ఏడుస్తూ ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఈ విధంగా తనకు కొడుకులు పుట్టి మరణించిన ఎనమండుగురు కొడుకులను ప్రతిసారి, వారిని తీసుకు వచ్చి రాజమందిర ద్వారం ముందు పెట్టి, ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ మునుపటిలాగే కొన్ని కథలు చదివి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా అతనికి పుట్టి చనిపోయిన తొమ్మిదవకొడుకును కూడ ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆక్రందిస్తున్న బ్రాహ్మణుడిని చూసిన అర్జునుడు ఇలా అన్నాడు. “అయ్యా! ఇలా నీవు దుఃఖిస్తుంటే చూసి ఈ అన్యాయాన్ని వారించే సమర్ధత గల విలుకాడు ఒక్కడు అయినా ఈ నగరంలో లేడా? ఇది పాపము. ఈలోకంలో అధికంగా ఎవరి రాజ్యంలో కన్నబిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరశోకంతో పరితపించే బ్రాహ్మణులు ఉంటారో, ఆ రాజు రాజు కాడు కేవలం వేషగాడు మాత్రమే. నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను అలా చేయకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను.” ఈ పలుకులు వినిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలాగా అన్నాడు. “అయ్యా! ఇలాంటి అవివేకపు మాటలు పలుక తగదు. మహా వీరులు, మహా బలశాలురు అయిన బలరామకృష్ణులు, కృష్ణకుమారుడు ప్రద్యుమ్నాదులు ఉండగా, ఇంకా ప్రశంసించదగిన బలం కలిగిన యాదవవీరులు ఉండగా, వారిచేతనే కాని పనిని చక్కపెట్టడం నీవు ఎలా చేయగలవు కానీ, నీ దారిన నీవు వెళ్ళు.” ఇలా అంటున్న ఆ బ్రాహ్మణుడి మాటలు వినిన అర్జునుడు అర్జునుడి మనసులో దురహంకారం పెచ్చుమీరింది. రెండు చేతులతో వడిగా బాణాలు వేయగలిగిన ఆ మహావీరుడు రోషంతో వశంతప్పి, అక్కడి జనాలు అందరు వినేలా విప్రుడితో ఇలా అన్నాడు. “నేను బలరాముడినికాను కృష్ణుడిని కాను; ప్రద్యుమ్నుడిని కాను; అతని కొడుకైన అనిరుద్ధుడిని కాను. యుద్ధంలో నా భీకరమైన గాండీవం నుండి వెలువడే వాడిబాణాలతో శత్రువులను చీల్చిచెండాడే మహాపరాక్రమం కలిగిన నేను అర్జునుడిని. అయ్యా! ఆ పరమశివుడినే ఎదిరించి పోరాడి భుజబలం చూపిన నన్నే ఎరుగవా? మృత్యుదేవత పొగరు అణచి, నా పట్టు ప్రదర్శించి, నీ పుత్రులను ఇప్పుడే తీసుకు వచ్చి ఇస్తాను.” ఇలా నమ్మకంగా పలికిన పార్థుడి మాటలపై బ్రాహ్మణుడి మనసు శాంతించింది. అతడు నరుని కొనియాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిదినాలు గడిచాయి. విప్రుడి భార్యకు మళ్ళీ ప్రసవించే సమయం సమీపించింది. భూసురుడు వెంటనే వచ్చి పరమ భీభత్సంగా యుద్ధంచేసే వాడైన అర్జునుడికి ఈ విషయం చెప్పాడు. అప్పుడు అర్జునుడు విశిష్టమైన పవిత్రజలాలతో ఆచమనం చేసాడు. పరిశుద్ధ ప్రదేశంలో నిలబడి శివుడికి నమస్కరించాడు. గొప్పగొప్ప అస్త్రాలను వేయగలిగిన అర్జునుడు శుభప్రదులైన మంత్రదేవతలను మనసున తలచుకుని గాండీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెంటినీ కట్టుకున్నాడు. బ్రాహ్మణుడి కూడా వెళ్ళి ఆ ప్రసవమందిరం చుట్టూ దట్టమైన బాణాలతో కప్పివేశాడు. మిక్కిలి జాగరూకతతో ప్రసూతిగృహానికి కావలి కాస్తున్నాడు. అప్పుడా బ్రాహ్మణుని భార్యకు మగ పిల్లాడు పుట్టి వెంటనే చనిపోయాడు. అక్కడి జనం ఆర్తనాదాలు చేశారు. మరణించిన పిల్లాడు ఈ సారి శరీరంతోసహా ఆకాశంలోనికి వెళ్లి అదృశ్యం అయ్యాడు. బ్రాహ్మణుడు విలపిస్తూ కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడి సమక్షంలో నిలబడి. “ముకుందా!మహాత్మా! నా విన్నపాన్నిఆలకించు. పౌరుషహీనుడైన పార్థుని డాంబిక వచనాలను నమ్మి అమాయకుడిని అయి కొడుకును పోగొట్టుకున్న నన్ను నేను ఏమని నిందించుకోవాలి. సమస్త జగత్తు సృష్టి స్థితి లయాలకు మూలకారకుడవు అయిన నీవు సమర్థుడివే అయినా వారించలేక ఊరకున్నావు. మానవమాతృడు ఇంతటి మహాకార్యం ఎక్కడ నెరవేర్చగలడు?” అని ఇంకా ఇలా అన్నాడు. ఈలాగున బ్రాహ్మణుడు తనను నిందిస్తుంటే, కోపం వచ్చిన అర్జునుడు తన విద్యాప్రభావంతో వెంటనే బయలుదేరి యమమందిరానికి నరకానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణపుత్రులు లేకపోడంతో పార్థుడు వెంటనే ఇంద్ర, అగ్ని, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుల నివాసాలకు వెళ్ళి అన్వేషించాడు. దేవ, యక్ష, కింపురుష, నాగ, రాక్షస, సిద్ధ, సాధ్య, ఖేచరాదుల ఇళ్ళకు వెళ్ళి బ్రాహ్మణపుత్రుల కోసం వెదికాడు. కాని వారి జాడ అక్కడ కూడా దొరకలేదు. చివరకు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేయటానికి పట్టుదలగా సిద్ధపడ్డాడు. శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని “బ్రాహ్మణ కుమారులను నేను నీకు చూపిస్తాను.” అని చెప్పి అర్జునుడిని మంటల్లో దూకకుండా వారించాడు. తరువాత సూర్యుడు ఉదయపర్వతాన్నిఎక్కినట్లు, అందమైన దివ్యరత్నకాంతులతో ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి అధిరోహించాడు. తన దేహకాంతులు దిక్కుల ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు విప్రబాలురను వెదకటానికి బయలుదేరాడు. పట్టణాలతో పల్లెలతో దుర్గాలతో అరణ్యాలతో పర్వతాలతో నదీనదాలతో సరోవరాలతో నిండిన భూమండలం, సప్తసముద్రాలు, మహాదీవులు, కులపర్వతాలు, మేరుపర్వతం దాటి శ్రీకృష్ణుడి రథం మహావేగంతో ముందుకు సాగిపోయింది. శ్రీకృష్ణార్జునులు దట్టమైన చీకటిమండలాన్ని ప్రవేశించారు. వారు సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటే, చీకటి మరింత భయంకరంగా తయారైంది. కళ్ళకేదీ కనిపించ లేదు. గుఱ్ఱాలు శక్తి కోల్పోయి దారితప్పి నిలబడిపోయాయి. శ్రీకృష్ణుడు భేదించరాని ఆ చీకట్లను రూపుమాపడం కోసం బాలసూర్యుడి కాంతికి సాటివచ్చే కాంతితో వెలిగే తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. అది విజృంభించి చిమ్మచీకటిని తొలగిస్తూ పైనుండి ముందుకు దూసుకుని పోసాగింది. కృష్ణార్జునులు చక్రాయుధం వెళ్ళే మార్గం వెంట అమితివేగంగా రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళి చీకటిని దాటారు. అప్పుడు వారి ముందు కన్నులు మిరుమిట్లు కొలిపే దివ్యతేజస్సు కనిపించింది. అర్జునుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతని ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళారు. మహావేగంగా వీచే గాలులతో, చెలరేగే కెరటాలతో గంభీరంగా ఉన్న జలరాశిని కృష్ణార్జునులు ప్రవేశించారు. ఆ కెరటాలు ఎగిరిపడుతుంటే "ఓం నమో నారాయణాయ" అని వినిపిస్తుంది. ఆ నీటి నడిమిభాగంలో కోటిసూర్యుల కాంతులు ప్రకాశిస్తున్నాయి. అక్కడ ఆ జలరాశిమధ్యలో ఒక దివ్యభవనం కనబడింది. దానిలో తేజోమయమైన వేలకొలది మనోహరమైన మణిస్తంభాలు ఉన్నాయి రమణీయ రత్నహారాలు అలంకృతమై వ్రేలాడుతున్నాయి. అది అనంత తేజస్సుతో విరాజిల్లుతోంది. సూర్యచంద్ర కిరణాలకు ప్రవేశింపరానిది, జన్మరాహిత్యానికి మార్గము, నిత్యైశ్వర్యదాయకము, అవ్యయము, మహోన్నతము, సాటిలేని వైభవోపేతము, పరమ యోగీంద్రులకు ప్రవేశయోగ్యము, భాగవతోత్తములకు నివాసస్థానము అయి విరాజిల్లుతోంది. ఆయొక్క మహాసౌధంలో అటువంటి ఆ దివ్యభవనంలో దట్టమైన శరత్కాలపు పండువెన్నెల, కర్పూరం, మంచులకు సాటివచ్చే తెల్లనిదేహము; తుమ్మెదల్లాగా నల్లకలువల్లాగా ఇంద్రనీలమణులలాంటి నల్లని కంఠాలు; ఉదయకాలం సూర్యుడిలాగా ప్రకాశించే పద్మరాగమణులతో కూడిన పడగలు; తెరచుకున్న నోళ్ళ నుంచి వెలువడే విషపు పొగలలా ఉన్న నాలుకలు; యాగగుండాలలోని జ్వాలలాగ ప్రకాశించే వేడిచూపులు; వెండికొండలాగా ఉన్న భారీ ఆకారము కలిగిన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడనే పాన్పు ఆ ఆదిశేషుని పాన్పుగా కొని సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తి దగ్గరకు శ్రీకృష్ణార్జునులు వెళ్ళి దర్శించారు. నీలమేఘశ్యాముడు, ఆశ్రితజనరక్షకుడు, పద్మాలలో తుమ్మెదలాగ సనకాది మునీంద్రుల హృదయపద్మాలలో నివసించేవాడు, పూర్ణ చంద్రుని మించిన ముఖకాంతి కలవాడు, విశ్వవిఖ్యాత చారిత్రుడు, ప్రాతఃకాలంలో వికసించిన పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీమనోహరుడు, శ్రీకరుడు, పీతాంబరధరుడు, హారాలు కేయూరాలు కటక కంకణాలు కిరీటాలతో భూషణుడు, భవసాగర శోషణుడు, భక్తజన సంపోషణుడు అయిన మహావిష్ణువును వారు చూసారు. బ్రహ్మదేవుని జనకుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి శ్రీకృష్ణార్జునులు భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, చేతులు జోడించి స్తుతించారు. ఆ ఆదినారాయణుడు వారిని దయాదృష్టితో చూసి, మందహాసం చేసి, సాదరంగా ఇలా అన్నాడు. భూమికి భారమైపోయిన రాక్షసులను వధించి, ధర్మాన్ని రక్షించడం కోసం నా అంశతో మీరిద్దరు నరనారాయణులుగా జన్మించారు. మహానిష్ఠతో ఉత్తములైన మిమ్మల్ని ఈ మునీశ్వరులు చూడాలని కోరారు. అందుకని, మీరిక్కడకు రావాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుని కుమారులను ఇక్కడకు తెప్పించవలసివచ్చింది.” ఈ బాలకులను మీరు తీసుకుని వెళ్ళండి” అని పలికి ఆ బాలకులను అప్పజెప్పి విష్ణువు వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుడిని అనేక విధాల స్తుతిస్తూ బ్రాహ్మణపుత్రులతో అక్కడ నుండి బయలుదేరారు. కోరిన పని సాధించి సఫల మనోరథులు అయిన కృష్ణార్జునులు వారి వారి వయసులకు తగిన ఆకారాలతో ఉన్న ఆ విప్రసుతులను వెంటబెట్టుకుని వచ్చి బ్రాహ్మణుడికి అప్పజెప్పారు. ఆ బిడ్డలను చూసిన ఆ విప్రుడు ఎంతో ఆనందం పొందాడు.తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడిని స్తుతించి ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు అత్యంత ఆనందించాడు. కొంతకాలం తరువాత మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పాండవులు కౌరవులపై విజయం సాధించారు. శ్రీకృష్ణ భగవానుడు తనను నమ్మిన పాండవులను వెనంటే ఉంది కాపాడుకున్నారు. పాండవులు హస్తనా పురములో సుఖీగా రాజ్యం చేసుకుంతున్నారు.



భగవద్గీత-అధ్యాయం13-శ్లోకం8

 భగవద్గీత

అధ్యాయం 13

శ్లోకం 8

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్ అనహంకార ఏవ చ |

జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ||

అర్ధం :-

అహంకార రాహిత్యము, జన్మ, మృత్యు, ముసలితనము, రోగాల యందు దుఃఖదోషములను పదే పదే దర్శించుట.





భగవద్గీత-అధ్యాయం13-శ్లోకం7

భగవద్గీత

అధ్యాయం13

శ్లోకం7

అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ |

ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమత్మ వినిగ్రహః ||

అర్ధం:-

తానే శ్రేష్ఠుడనే భావము లేకుండా ఉండటం, డాంబికము లేకుండా ఉండటం, అహింస, క్షమించే గుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురువులను సేవించటం, బాహ్యభ్యాంతరశుద్ధి, అంతఃకరణస్థిరత్వము, ఇంద్రియార్థముల యందు నిగ్రహం.



మరణించిన తన అన్నలను తిరిగి తీసుకువచ్చి తల్లికి చూపించిన శ్రీకృష్ణుడు



ఒకరోజు ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్టుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు మొదలైన సకల మహర్షులు ద్వారకానగరానికి కృష్ణ సందర్శనార్థం వచ్చారు. వచ్చిన ఆ మునీశ్వరులకు శ్రీకృష్ణుడు ఎదురేగి, నమస్కారాలు చేసి, యథావిధిగా పూజించి వారితో మహామునిశ్రేష్ఠులారా! దేవతలకు సైతం లభించని మీ వంటి పరమ యోగీశ్వరుల దర్శనం మానవమాతృలైన మాకు ఇక్కడ లభించింది. దురదృష్టవంతులకు ఇంద్రియలోలురకు మూఢులకు మీవంటి పుణ్యాత్ముల దర్శనం, స్పర్శనం, చింతనమూ, పాదార్చనమూ దుర్లభ్యములు. అయినా ఇక్కడ మాకు అవి అతి సులభంగా ప్రాప్తించాయి. ఈ లోకంలో సాధువులు పవిత్ర తీర్థాల వంటి వారు. మిమ్మల్ని దర్శించటయే చాలు. వేరే పుణ్యతీర్ధాలు వెదకవలసిన అవసరం లేదు. అంతేకాకుండా, తీర్ధాలూ నీళ్ళతో నిండి ఉంటాయి; దేవతా ప్రతిమలు మట్టిచేత, రాతిచేత చేయబడి ఉంటాయి; అవి కూడా పరమ పవిత్రాలే అయినా వాటిని చాలాకాలం సేవించి పూజిస్తే కాని ఫలితం చేకూరదు. కానీ సత్పురుషులు తమ దర్శనం మాత్రం చేతనే పావనం చేస్తారు.


శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలు విని ఆ మునిశ్రేష్ఠులు విస్మయ హృదయులై, క్షణకాలం మౌనం వహించారు. వెనువెంటనే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొంది, చిరునవ్వు ముఖాలతో ఆయనతో ఇలా అన్నారు. “దేవా! మేము, ఉత్తమ తత్వవేత్త లైన బ్రహ్మరుద్రాదులు నీ మాయకు లోబడి ఉన్నాము. నిగూఢమైన నీ అభీష్టం మేరకు మమ్ము అనుగ్రహించావు. నీ చరిత్ర అత్యంత విచిత్రమైనది. ఈ భూమి ఒక్కటే అయిన అనేక రూపాలతో ఎలా కనపడుతుందో అలా నీవు ఒక్కడివే అయినా అనేక రూపాలతో సృష్టిస్థితిలయాలు అనే అద్భుతకార్యాన్ని చేపట్టి, లీలావతారాలు ఎత్తి, దుష్టజనశిక్షణం శిష్టజనరక్షణ చేస్తూ ఉంటావు. అంతే కాకుండా, నీవు వర్ణాశ్రమధర్మాలను అంగీకరించి విరాట్పురుషరూపంతో వేదమార్గాన్ని స్పష్టం చేసిన బ్రహ్మస్వరూపుడవు. తపస్సు ధ్యానం నియమాల చేత పరిశుద్ధం అయింది నీ హృదయం. అందుకనే బ్రహ్మస్వరూపాలైన వేదాల్లో వ్యక్తావ్యక్తమైన ఆకారంతో ఉంటున్నావు. కనుకనే, బ్రాహ్మణకులాన్నిరక్షించిన బ్రహ్మణ్యమూర్తివి; మహానుభావుడవు; మాయ అనే తెరచాటున ఉన్న నిన్ను ఈ రాజలోకమూ మేమూ దర్శించ గలిగాము; మా జన్మమూ, మా విద్యా, మా తపోమహిమా సార్ధకమయ్యాయి; నీకు నమస్కరిస్తున్నాము.” అని మునీంద్రులు బహు విధాల శ్రీకృష్ణుడిని ప్రశంసించి ఆయన వద్ద వీడ్కోలు పొంది తమతమ నివాసాలకు బయలుదేరు సమయంలో వసుదేవుడు ఆ మహర్షులకు నమస్కారం చేసి, “ఋషివరులారా! మీరు ధర్మతత్వజ్ఞులు. క్షమించి నా మనవి ఆలకించండి. సత్కర్మల ద్వారా పూర్వజన్మ కర్మలను పోగొట్టుకునే ఉపాయం నాకు దయతో తెలియ జెప్పండి.” అని ప్రార్థించాడు. అప్పుడా మునీశ్వరులు రాజులు అందరూ వింటూండగా వసుదేవునితో ఇలా అన్నారు. “ఈ శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞాలకూ అధీశ్వరుడు; ఈ పుండరీకాక్షుడి గురించి చేసే యాగం వలన ఎలాంటి దుష్కర్మమైనా తొలగిపోతుంది. దీన్నే ధర్మంగా గ్రహించు. యజ్ఞాలు చేసి దేవతలఋణం; వేదాధ్యయనం చేసి ఋషిఋణం; పుత్రుని వలన పితృఋణం తీర్చుకోవాలి; ఇలా ఈ ఋణత్రయాన్ని తీర్చలేని మానవుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి పోతాడు. నీవు ఉత్తములు అయిన పుత్రుని మూలంగా పితృఋణం తీర్చుకున్నావు. వేదము చదువుట వలన ఋషిఋణము తీర్చుకున్నావు. ఇలా రెండు ఋణాలు తీర్చావు. ఇంక ఉచితమైన పని, యజ్ఞం చేసి దేవఋణాన్ని తీర్చుకోవడం. ఈవిధంగా వివరించిన మహర్షులు మాటలు విని, వసుదేవుడు వారితో ఇలా అన్నాడు. “తేజోనిధులైన ఓ మహర్షులారా! మీరు ఉపదేశించిన ప్రకారం యాగం చేస్తాను. దానిని మీరే ఋత్విజులై జరిపించాలి. అని వినయంగా వారికి మనవి చేసాడు. వసుదేవుడు ఆ మునీంద్రులను ఋత్విక్కులుగా ఎంచుకుని, శ్యమంతపంచకతీర్థం సమీపంలో దేవేంద్రుడిని మించిన వైభవంతో భార్యలు పద్దెనిమిది మందితో సమేతంగా యాగదీక్షను గైకొన్నాడు. ఆ యజ్ఞాన్ని శాస్త్రప్రకారం పూర్తిచేసాడు. ఋత్విక్కులను అనేక దక్షిణలతో సంతృప్తి పరిచాడు. భార్యలతో కలిసి అవభృథస్నానం చేసాడు. పిమ్మట, వివిధ మణిమయ భూషణాలు, నూతనవస్త్రాలు, పరిమళభరితమైన పూలదండలు, మనోహరమైన మైపూతలు ధరించాడు. బ్రాహ్మణులనూ మునులనూ బంధువులనూ రాజసమూహాన్నీ సముచిత సత్కారాలతో సంతోషింప చేసాడు. వారు కూడా శ్రీకృష్ణుడి అనుమతి తీసుకొని తమతమ నివాసాలకు తిరిగి వెళ్ళారు. ఉగ్రసేన మహారాజు బలరామ కృష్ణులూ నందుడు యశోదా గోపగోపికలతోసహాఅక్కడే కొన్నాళ్లు ఉండమని వేడుకొన్నారు. వారి మాట మన్నించి కొన్నాళ్ళుపాటు తృప్తిగా అక్కడే ఉన్నారు. విధంగా శ్రీకృష్ణుని మంచితనాన్నీ, మర్యాదనూ, మాటల మాధుర్యాన్నీ, హరి మనోహరమైన లీలావిలాసాలు వింటూ నందుడు మూడునెలలు అక్కడనే ఉన్నాడు. తరువాత పద్మాక్షుడు శ్రీకృష్ణుడు తక్కిన యాదవ ప్రముఖులు అందరు నందుడికి అతడి పరివారానికి తగిన ఆభరణాలు వస్త్రాలు సర్వం బహుకరించి వీడ్కోలు పలికారు. ముకుందుడిని వదిలి వెళ్లలేక బలవంతంగా మరలించుకుని నందుడు మొదలైనవారు ప్రయాణం సాగించారు. కృష్ణ! మాధవ! గోవింద! పద్మనాభ! భక్తపారిజాతమా! దేవాధిదేవా! అనుకుంటూ శ్రీకృష్ణనామాలు జపిస్తూ మాటిమాటికీ వెనుతిరిగి చూస్తూ, పోలేక పోలేక నందుడూ అతని అనుచరులూ మధురానగరం వైపు సాగిపోయారు. కొంతకాలం తరువాత ఇంతక్రితం బలరామకృష్ణులు సముద్రంలో పడిపోయిన తమ గురుపుత్రుడిని మళ్ళీ తెచ్చి ఇచ్చిన విషయం ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా, వసుదేవుడి భార్య దేవకీదేవి విన్నది. కంసునిచేత వధింపబడి యముని సదనంలో ఉన్న తన బిడ్డలను చూడాలని అమె మనసులో కోరిక బలపడింది. అమె బలరామ కృష్ణుల దగ్గరకు వెళ్ళి కన్నీరు కారుస్తూ “ఓ బలరామా! ఓ కృష్ణా! మీరు పాపాత్ములైన కంసుడు, చేదిదేశపు శిశుపాలుడు, మురాసురుడు, పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు మున్నగు దుష్ట రాజులను సంహరించి భూభారాన్ని బాపిన మహా బలవంతులు.” అని దేవకీదేవి బలరామ కృష్ణులను ప్రశంసించి, “మీరు తలచుకుంటే మీరు సృష్టి స్థితి లయాలు జరిపే పరమపురుషులు. అవన్నీ మీ లీలావిలాసాలు. నేను మిమ్మల్ని నమ్మిన దానిని. నా కోరిక వినండి నాయనలారా!” అని ఇలా బలరామకృష్ణులను స్తుతిస్తూ దేవకీదేవి వారితో ఇలా అన్నది. “మహానుభావులారా! మీరు చాలా కాలం క్రితం మృతుడై యమలోకంలో ఉన్న గురువు యొక్క కుమారుని తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించిన మహాత్ములు. మీ గొప్పదనం లోకులు వేనోళ్ళ పొగడుతున్నారు. అలాగే కంసుడు సంహరించిన నా బిడ్డలను తీసుకువచ్చి నా శోకాన్ని నివారించండి.” ఇలా తల్లి దేవకీదేవి వేడుకోగా బలరామకృష్ణులు ఆదరంతో విన్నారు. తమ యోగ మాయా ప్రభావంతో సుతలలోకానికి వెళ్ళారు. అప్పుడు సుతలలోక నివాసి ఐన దానవ చక్రవర్తి బలిచక్రవర్తి శ్రీకృష్ణ బాలరాముడు వస్తుండగా చూసాడు. బలిచక్రవర్తి తన ఆప్తులతో బలరామ కృష్ణుల కెదురు వచ్చి అత్యంతానురాగంతో వారికి స్వాగతం పలికి, పాదాభివందనాలు చేసాడు. వారిని సువర్ణపీఠాలపై ఆసీనులను చేసి వారి పాదాలు కడిగి పాదజలాన్ని భక్తితో తల మీద చల్లుకున్నాడు. నా పాపం అంతరించింది; సంసారసాగరం దాటగలిగాను; ముక్తిసాధనం చూడగలిగాను; నీ కరుణాదృష్టికి పాత్రుడనయ్యాను; పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కానరాని మహాత్మా! నీవు నా గృహానికి విచ్చేశావు. నేను ధన్యుడిని అయ్యాను. భగవాన్! నేను నీ దాసుడిని; నీ అజ్ఞకు బద్ధుడిని; మీరిక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పండి.” అని బలిచక్రవర్తి చేతులు జోడించి భక్తితో విన్నవించాడు. కృష్ణుడు సంతోషించి అతనితో ఇలా అన్నాడు. పూర్వం ఆదియుగంలో మరీచి అనువానికి భార్య వర్ష యందు ఆరుగురు పుత్రులు పుట్టారు. ఒకనాడు బ్రహ్మదేవుడిని అపహాస్యం చేసారు. ఆగ్రహించిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా పుట్టండని శపించాడు. ఆ శాప కారణంగా వారు హిరణ్యకశిపుడికి కొడుకులుగా పుట్టారు. తరువాత దేవతల హితంకోరి యోగమాయ వారిని దేవకిగర్భం లోనికి ప్రవేశింపజేసింది. దేవకీదేవి గర్భాన వారు ప్రసవించారు. పట్టుబట్టి కంసుడు ఆ శిశువులను చంపివేశాడు. ఇప్పుడు దేవకీదేవి పుత్రశోకంతో కుమిలి వారిని చూడాలని కోరి పంపగా మేము ఇచ్చటకి వచ్చాము. పుణ్యాత్మా! ఆమెకు వారిని మరల తీసుకువస్తా మని మాట ఇచ్చి ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర సుఖంగా ఉన్న వీరే ఆమె పుత్రులు. వీరిని తీసుకు వెళ్ళి భూలోకంలోఉన్న మా తల్లి శోకాన్నిపోగొడతాము. అంతటితో వీరు శాపవిముక్తులు కాగలరు; మా అనుగ్రహం వలన దివ్యజ్ఞానం కలవారు కాగలరు. తరువాత నా అనుగ్రహం వలన వీరికి సుగతి ప్రాప్తిస్తుంది.” ఈవిధంగా పలికి కృష్ణుడు బలిచక్రవర్తి అనుమతి పొంది భూలోకానికి దేవకీతనయులను తమ కూడా తీసుకుని వచ్చాడు. ఆరుగురు శిశువులను తీసుకుని వచ్చి తల్లి దేవకీదేవితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. అమ్మా! ఇరిగో వీరే నీ బిడ్డలు చూడు” అంటూ ఆ బాలకులను తల్లి దేవకీదేవి ముందుకు తెచ్చాడు. ఆమెలో పుత్రవాత్సల్యం పొంగిపొరలింది. వారిని కౌగలించుకుని “నా కన్నబిడ్డలు వచ్చారు,” అని లాలించింది. అలా లాలించి, తన చిన్నారి తనయులను దేవకీదేవి ఆలింగనం చేసుకుని, ఒడిలో కూర్చోబెట్టుకుంది. వారి నడినెత్తిన ముద్దిడింది, గడ్డం పుణికింది. పెల్లుబికిన ప్రేమతో ఆమె దేహం పులకలెత్తంది. వారికి చన్నిచ్చింది. వారు వైష్ణవ మాయా ప్రభావానికి వశులై తల్లిపాలు త్రాగారు. శ్రీకృష్ణుని స్పర్శవలన నిర్మలులు అయ్యారు. శ్రీహరి దయ అనే పడవ సహాయంతో బ్రహ్మశాపం అనే సాగరాన్ని దాటి స్వస్వరూపాలు ధరించి తమ తమ స్థానాలు చేరుకున్నారు. అంతట దేవకీదేవి తన మనసులో అచ్చెరువొందింది.

భగవద్గీత-అధ్యాయం13-శ్లోకం6

భగవద్గీత

అధ్యాయం13

శ్లోకం6

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాదృతిః |

ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ||

అర్ధం:-

ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూలశరీరము, చైతన్యము, దృతి అను వికారములతో గూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది.



శమంతపంచకం



బలరామకృష్ణులు ద్వారకలో సుఖంగా ఉన్న రోజులలో కల్పాంత కాలంలో వచ్చే చూడటానికి విలులేని విధంగా సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్నారు. ప్రజలందరూ తమ వెంట రాగా వారు శమంతపంచకం అనే మహా పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే, పరశురాముడు పరక్రమంతో అభిరాముడై ఇరవైఒక్క సార్లు దండెత్తి, వజ్రాయుధం లాంటి తన పరశువు(గోడలి) రాజలోకానీ దునుమాడాడు. లోకాన్ని నిఃక్షత్రియం చేసాడు. ఆసమయంలో ఆ రాజుల శరీరాలనుండి స్రవించిన రక్తం ప్రవాహం కడితే ఆ రక్తప్రవాహాన్ని పరశురాముడు ఐదుమడుగులు కావించాడు. అవి శమంతపంచకం అనే పేరుతో పవిత్రక్షేత్రంగా రూపొందాయి. అట్టి శమంతకానికి శ్రీబలరామకృష్ణాది యాదవులు గ్రహణ సందర్భంగా చేరుకున్నారు. బలరామకృష్ణులు లోకధర్మపాలనకు పూనుకుని, ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, సుచంద్రుడు, శుకుడు, సారణుడు, అనిరుద్ధుడు, కృతవర్మ మున్నగు యాదవ మహాయోధులను నగర రక్షణ కోసం ద్వారకలో నిలిపారు. అక్రూరుడు, వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైన యాదువులుతో కలిసి, వారు సర్వాలంకారశోభితులై కాంతాసమేతంగా బయలుదేరారు. పుష్పక విమానాల వంటి రథాలు, మేఘాలను పోలు ఏనుగులు, మనోజవములైన అశ్వాలు వంటి, వారివారికి తగిన వాహనాలలో శమంత పంచకానికి ప్రయాణం అయ్యారు. దేవతలకు సాటి వచ్చే సేవకులు వారిని సేవిస్తుండగా ఆ పుణ్యక్షేత్రం చేరారు. ఆ పుణ్యతీర్ధాలలో స్నానాలు చేసి ఉపవాసాలు చేశారు. తరువాత గృహ, భూషణ, భూ, సువర్ణ, రత్న, గోదానాలు చేసారు. మఱియు, అనేక గొప్ప వస్తువులు మున్నగువాటిని సాటిలేని దానాలు, మనోజ్ఞంగా బ్రాహ్మణోత్తములకు ఇచ్చారు. దానాలు చేసాక, శమంతపంచకంలో మరల స్నానాలు చేసి, బలరామ కృష్ణులు బంధువులతో కలసి భోజనాలు చేసారు. వీరికంటే ముందుగా ఎందరో క్షత్రియ ప్రముఖులు మున్నగు వారు ఆ పుణ్యతీర్థాన్ని సేవించడానికి వచ్చి ఉన్నారు. ఆ మత్స్య, ఉశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆరట్ట, కేరళ మున్నగు సకల దేశాధీశ్వరులూ; శ్రేయోభిలాషులు; నందగోపాది గోపాలకులూ; ధర్మరాజుతో కలసివచ్చిన భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సతీ సమేతులైన పాండవులు; సంజయుడు, విదురుడు, కృపాచార్యులు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్తు, ద్రుపదుడు, శైబ్యుడు, ధృష్టకేతుడు, కాశిరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, యుధామన్యువు, సుశర్మలును; పుత్రసమేతంగా వచ్చిన బాహ్లికుడు; మొదలైన వారందరూ ఉగ్రసేనాది యాదవ ముఖ్యులచే పూజలందుకున్నారు. అందుకు వారంతా ఎంతో సంతోషించారు. ఆ రాజులు అందరూ సతీసమేతంగా వచ్చి, ప్రియకాంతా పరివారాలతో కూడి ఉన్న శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నారు. ఈ శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు. తెలియండి. మన శాస్త్రాలు, మాటివ్వడాలు, మనసు పెట్టడాలు, శుభాకాంక్షలు అన్నీ ఈ పరంధాముని పాదపద్మతీర్ధం వలన పవిత్రములు అవుతున్నాయి; ఈ మహాత్ముడి పాదస్పర్శకు నోచుకున్న ప్రదేశాలు అన్నీ ముక్తిదాయకాలే. అంతటి మహానుభావుడు ఈయన. సనకసనందాది మహామునులు తమ యోగదృష్టితో ఆత్మసాక్షాత్కారం చేసుకోదలచినా గోచరంకాని మంగళమూర్తిని, ఇలా ఈ ఉగ్రసేనాది యాదవులు ఎల్లవేళలా భౌతిక నేత్రాలతో కన్నులారా చూస్తున్నారు. వీరి పుణ్యము ఎంతటిదో? వీరు ఎంత నిష్ఠతో తపస్సు చేసి ఇది పొందారో? ఈ యాదవ పుంగవులు స్వర్గ నరకాలను లెక్కచేయక, ఈలాగున కృష్ణుడిని చూస్తూ కృష్ణుని పొగుడుతూ కృష్ణునితోకలసి ప్రయాణం చేస్తూ కలసి కూర్చుంటూ కలసి శయనిస్తూ సాయుజ్యము పొందినట్లు ఉన్నారు. కృష్ణునితో ఈ బంధుత్వ మిత్రత్వాలు కలిగే భాగ్యం వీరికి ఎలా లభ్యము అయిందో? అని ఆ రాజశ్రేష్ఠులంతా ఆశ్చర్యపడుతూ, శ్రీకృష్ణుడి దయవలన సిద్ధించిన సకల వైభవాలతో జీవిస్తున్న ఉగ్రసేనాది యదు వృష్ణి పుంగవులను ఆ రాజులు అందరూ అనేక సార్లు అభినందించారు. ఆ సమయంలో పాండురాజు పత్ని కుంతీదేవి తన కుమారులకు కౌరవులవలన కలిగిన అపకారాలకు మనస్సులో బాధపడుతూ స్మరించుకుంటుంటే తన అన్నగారు నిర్మలాత్ముడు అయిన వసుదేవుడు కనబడ్డాడు. అన్నయ్యా! పాండురాజుకు పుత్రులు, నీకు అల్లుళ్ళూ అయిన పాండవులు కీకారణ్యాలలో భీకరమృగాల మధ్య పలుబాధలు పడతున్నారు. వారిని మీరు దయార్ద్రహృదయంతో చూడాలి కదా. బహు బలవత్తరమైన విధి, ప్రతికూలంగా ఉంటే, ఇంకా బంధువులంటూ ఎవరుంటారులే?” అంటూ కంటతడి పెడుతున్న సోదరి కుంతితో వసుదేవుడు ఇలా అన్నాడు. కుంతీ! నీవు బాధపడడం దేనికమ్మా? విధిని నిందించడ మెందుకు? అన్నింటికీ కర్త ఈశ్వరుడే మాయ అనే తెరవెనుక ఉన్న సూత్రధారి వంటివాడు అయిన ఆయన నడిపిస్తుంటే నటించే ఈ మానవులు అంతా అతని చేతిలో కీలుబొమ్మలు కనుక విధికి ఎదురీదడం దేవతలకైనా సాధ్యం కాదు. ఇంతకు ముందు దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని క్రూరంగా బాధించాడు. మేము మా స్వస్థలం వదిలి, అడవుల పాలై, నానా అవస్థలూ పడ్డాము. కరుణాసింధు వైన ఈ కృష్ణుడి అనుగ్రహంచేత మేము ఆ ఇక్కట్ల నుండి గట్టెక్కి ఇలా ఉన్నాము. అని తన చేలేలైన కుంతిని ఊరడించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడిని చూడాలనే ఆనందంతో నంద యశోదలు, గోపాలురను గోపికలను వెంటబెట్టుకుని వచ్చారు. ఈవిధంగా చాలాకాలం తర్వాత వచ్చిన నందుని వృష్ణి, భోజ, యాదవ ప్రముఖులు అందరూ వరుసగా ఎదురేగి ప్రేమతో పరామర్శించి, కౌగలించుకొని స్వాగతం పలికారు. వసుదేవుడు సంతోషంతో వారికి సముచిత సత్కారాలు చేసాడు. బలరాముడు శ్రీకృష్ణుడు వినయంగా నందయశోదలకు నమస్కరించారు. అలా నందయశోదలకు బలరామకృష్ణులు నమస్కరించిన తరువాత వారిని కౌగలించుకుని నిండుగా స్నేహభావాలు, భక్త్యనురాగాలు పెల్లుబికి కనుల వెంట అనందబాష్పాలు పొంగిపొరలగా మాటలురాక మౌనంగా ఉన్నారు. అంతట, యశోదాదేవి బలరామకృష్ణులను ఒడిలో కుర్చుండపెట్టుకున్నది. వారిని తన గుండెలకు హత్తుకున్నది. చెక్కిలి ముద్దాడింది. చిబుకాలు నిమురుతూ పలుమార్లు కౌగలించుకొని పరమానందం పొందింది. ఆ తరువాత గోపకాంతలు రాకరాక వచ్చిన తమ ప్రాణేశ్వరుడైన శ్రీకృష్ణుడిని చూడాలనే తహతహ ఆనందం హృదయాలలో పొంగిపొరలుతుండగా అక్కడికి చేరారు. పద్మదళాక్షుడు గోపాలుడిని చూస్తున్నంతసేపూ ఆ గోపికలు తమ కళ్ళ రెప్పలను వాల్చలేకపోయారు. వారు కృష్ణుని జగన్మోహన సౌందర్య వైభవాన్ని వర్ణించుకుంటూ, తమ మనసులలో కౌగలించుకుంటూ, బ్రహ్మసాక్షాత్కారం పొందిన యోగులలాగా ఆ గోపస్త్రీలు పరవశించగా వారి తనువులు గగుర్పొడిచాయి. కాంతలతో చక్కని చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు. కాంతలారా! బలవంతులైన శత్రువులను జయించటానికి వెళ్ళాము. తిరిగిరావడానికి ఆలస్యమైనది. అందుచేత మీరు అంతగా అలుగవద్దు. ఎప్పుడూ గాలికి ఎగురగొట్టబడే దూదిపింజలలాగ, గడ్డిపరకలలాగ చరాచర ప్రపంచం దైవసంకల్పాన్ని అనుసరించి ఒక్కోసారి కలుస్తూ, ఒక్కోసారి విడిపోతూ ఉంటుంది. నాపై భక్తికల మనసులు గలవారికి మోక్షం సులభసాధ్యము, ఆనందదాయకము అవుతుంది. కేవలం జపము, తపస్సు, దానాలు మున్నగు సత్కార్యాలతోటి ముక్తి కలుగదు. శివుడు, బ్రహ్మదేవుడు సనక సనందాదులకు సైతం తమ హృదయాలలో అంకురించని అంతటి గాఢమైన భక్తి మీలో మొలకెత్తింది. మీరు పుర్వజన్మలలో చేసిన సుకృతాల విశేషం పరిపూర్ణంగా ఫలించింది. మీ పుణ్యఫలం వ్యర్థం కాదు. నా యందలి అధికమైన ధ్యానం గల బుద్ధి వలన, ఇక ఎప్పటికీ నరక హేతువులైన జన్మకర్మలు మీకు కలుగవు. సమస్త జీవుల బహిరంతరాల్లోనూ సర్వ కాల సర్వావస్థలలోను నేనుంటాను. సకల ప్రాణుల కార్యకలాపాలకూ పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల సంబంధమే కారణము. ఘటపటాది న్యాయం ప్రకారం వీటిని ఉపాదాన కారణములు అంటారు. అటువంటి పంచభూతాలకూ ఆధారము అయినవాడను నేనే. కనుక నేనే సర్వమునకూ కర్తను. అటువంటి నాకు స్వపరాది తారతమ్యాలు లేవు. నిర్మల హృదయులారా! ఈ విషయంలో ఏ సందేహము కాని, తర్కవితర్కాలు కాని అక్కర లేదు. ఈ విధముగా, శ్రీకృష్ణుడు తన మహత్మ్యాన్ని విశదీకరించగా వినిన గోపికలు వివేకవంతులై దేహాభిమానాలను విసర్జించారు. అచ్యుతుని అనంత గుణాలను కీర్తించారు. తరువాత నందనందనుడు గోపికలు కోరిన ప్రకారం వరాలు అనుగ్రహించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి, అతనికి నమస్కరించి, “ధర్మరాజా! నీవూ, నీ తమ్ముళ్ళూ, బంధుజనాలూ సత్కర్మ నిరతులై సుఖంగా ఉన్నారా?” అని అడిగాడు. అంతట ధర్మరాజు ప్రీతితో మధుసూదనుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. మురారి! నీ పాదారవిందాలను ఆశ్రయించినవారు నిత్యసౌఖ్యాలతో అత్యంత సంతుష్టులై ఉంటారు కదా. నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలు అనే అవస్థాత్రయానికి అతీతుడవు అఖండ జ్ఞానస్వరూపుడవు సకల లోకాలకు అధినాథుడవు సర్వవ్యాపివి విశ్వమే నీవు నీవే విశ్వం ఈ విశ్వమునకు వెలుపల లోపల వ్యాపించి ఉంటావు ఈ విశ్వం నీ యందే నిలచి ఉంటుంది సృష్టి స్థితి లయాలు నీ సంకల్పాధీనాలు యోగమాయ నీకు లోబడి ఉంటుంది పాపదూరులై నిత్యముక్తులైన యోగులు నిను చేరుట కొఱకే ప్రయత్నిస్తారు అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. విధంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని ప్రస్తుతించగా విని అక్కడ ఉన్న రాజులు, బంధు మిత్రులు, సకల జనులు రంజిల్లిన నిండు మనసులతో ఎంతో సంతోషించారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇంకా కొన్ని రోజులలో అరణ్యవాసం ముగుస్తుంది అని తరువాత అజ్ఞాతవాసానికి వెళతామన్ని అందులోకూడా తమకు విజయం దక్కలని తమకు తోడుగా ఉండమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అజ్ఞాతవాసంలో మీకు తోడుగా ఉండలేను కానీ నా అశీస్సులు మీతోనే ఉంటాయి. అరణ్యవాసం లాగానే అజ్ఞాతవాసాని కూడా మీరు విజయవంతంగా పూర్తిచేస్తారు అని అన్నారు.

భగవద్గీత-అధ్యాయం13-శ్లోకం5

 భగవద్గీత

అధ్యాయం 13

శ్లోకం 5

మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |

ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః||

అర్ధం:-

పంచమహాభూతములు, అహంకారం, బుద్ధి, మూలప్రకృతి, అలాగే దశేంద్రియాలు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు.



సహాయం చేయమని తనని వెతుకుంటూ వచ్చిన మిత్రుడిని సకల సంపదలను అనుగ్రహించిన శ్రీకృష్ణుడు


కుచేలుడు అని శ్రీకృష్ణునికి ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన ఇంట దారిద్ర్యం దారుణంగా తాండవిస్తున్నా, ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించిన కాసును కూడా పదివేలుగా భావించి, ఏదో ఒక విధంగా భార్యాపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. కుచేలుని భార్య మహాపతివ్రత. చక్కటి వంశంలో పుట్టిన సాధ్వి. ఒకరోజు పిల్లలు ఆకలి మంట చేత కృశించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులూ గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నం పెట్టమని అడుగుతుంటే, ఆమె మనసు క్షోభ భరించలేకపోతోంది. అందుకని, ఆమె భర్తతో  ఇలా తాండవిస్తూ ఉన్న పేదరికం బాగా బాధిస్తోంది కదా. దీని గురించి మీరు ఆలోచించడం లేదు. శ్రీకృష్ణుడు మీ బాల్యమిత్రుడు కదా. మీరు వెళ్ళి ఆ మహానుభావుడిని దర్శించండి. అతని కృపాకటాక్షం పొంది, దారిద్ర్యంతో తల్లడిల్లుతున్న పిల్లలను, నన్ను కాపాడండి. శ్రీకృష్ణుడు ఆశ్రితులను రక్షించేవాడు. సజ్జనుల ఎడ, భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు. దయాసాగరుడు. యాదవులు తనను సేవిస్తుండగా, కుశస్థలీపురములో ఉన్నాడు కదా. ఒక్కసారి, ఆ శ్రీపతిని దర్శించండి. మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తాడు. కలలోకూడా తన్నెన్నడూ స్మరించని పాపాత్ముడు అయినా, ఆపదలు చుట్టుముట్టి నప్పుడు, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ ఆశ్రిత రక్షకుడి పాదారవిందాలను మనసారా స్మరిస్తే చాలు. ఎలాంటి వాడిని అయినా కనికరిస్తాడు. అవసరమైతే తనను తానే అర్పించుకుంటాడు కదా. అంతటి మహానీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే మీవంటి వారికి విశేషమైన సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? అని అన్నది. అంత విన్న కుచేలుడు తన భార్యతో నీ వన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కల్యాణప్రదమే. కాని శ్రీకృష్ణుడి  దగ్గరకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి కానుక ఏదయినా మన వద్ద ఉందా. భర్త అభిప్రాయం అంగీకరించిన కుచేలుని భార్య “అలాగే కానివ్వండి” అంది. పిమ్మట అతని చినిగిన పైట కొంగులో కొన్ని అటుకులు ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవింద దర్శనం అవుతుందనే ఉత్సాహంతో బయలుదేరాడు.

ద్వారకకు వెళుతూ దారిలోకుచేలుడు తనలో తాను “ద్వారకలోనికి నేను ఎలా వెళ్ళగలను? అత్యంత ప్రభావవంత మైన అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణుడి దర్శనం ఎలా లభిస్తుంది? ఒకవేళ ద్వారపాలకులు “నీవెక్కడ బ్రాహ్మణుడవయ్యా! ఇక్కడకి ఎందుకు వచ్చావయ్యా” అని నన్ను అడ్డగిస్తే నేనేమి చేయగలను? వారికి ఏదయినా బహుమానం ఇద్దామన్నా నేను కటికదరిద్రుడినే. ఏమివ్వగలను? ఇంతకూ నా అదృష్టం ఎలా ఉందో? అయినా, ఆ శ్రీకృష్ణుని కృపాకటాక్షం తప్ప మరొక మార్గం ఏమున్నది? ఆయన నన్నెందుకు ఉపేక్షిస్తాడు?” ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారక ప్రవేశించాడు. ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారకాపట్టణం రాజమార్గాన ముందుకు సాగిపోయి, కొన్ని ప్రాకారాలు దాటాక అక్కడ శ్రీకృష్ణుని పదహారువేల సతులతో ప్రకాశిస్తున్న సుందర సమున్నత మణిమయ స్వర్ణసౌధాలను చూసి కుచేలుడు పరమానందం చెందాడు. అతని కళ్ళలో ఆనందబాష్పాలు స్రవించాయి. ఒక అంగన మందిరంలో మగువలు వింజామరలు వీస్తుండగా హంసతూలికాతల్పం మీద శ్రీకృష్ణుడు సతీమణితో మాట్లాడుతున్నా ఆ మనోహర సౌందర్యమూర్తిని పద్మాక్షుని దర్శించాడు. దారిద్యం వల కూసించిపోయిన శరీరంతో చిరిగిన బట్టలతో కుచేలుడు వస్తుంటే అల్లంత దూరంలో చూసిన శ్రీకృష్ణుడు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు. ఆదరాభిమానాలతో కుచేలుని కెదురుగా వెళ్ళి శ్రీకృష్ణుడు అతనిని కౌగలించుకున్నాడు. స్నేహ పూర్వక అనురాగం ఉట్టిపడేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తీసుకువచ్చి తన పాన్పు మీద కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుడు బంగారు కలశంలో నీళ్ళు తీసుకు వచ్చి ఆయన పాదాలను కడిగాడు. ఆ జలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకున్నాడు. పిమ్మట మనోహర మైన కస్తూరి, పచ్చకర్పూరపు మైపూతలు తీసుకుని మనోజ్ఞ మైపూతలు కుచేలుని శరీరానికి ప్రీతితో అలది, మార్గాయాసం తీరేలా స్వయంగా ఆప్తమిత్రుడు కుచేలునికి విసన కఱ్ఱతో విసిరాడు. కుచేలుడికి కర్పూరతాంబూలం ఇచ్చి, గోదానం చేసి, ఆదరంగా కుశలప్రశ్నలు అడిగాడు. అప్పుడు కుచేలుడి శరీరం పులకించింది, కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణి  వింజామరము వీచింది. ఆ చల్లని గాలికి కుచేలుని మార్గాయాసం తీరింది. ఈ దృశ్యాన్ని చూసిన అంతఃపురకాంతలు విస్మయంతో ఇలా అనుకున్నారు. “ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేసాడో? మహా యోగులచేత పూజింపబడే శ్రీపతి పరుండు పానుపు మీద అధివసించాడు. ఎంతటి మహామునులు అయినా ఈ మహానుభావునికి సాటిరారు కదా. శ్రీకృష్ణుడు లేచి వెళ్ళి విప్రోత్తమునికి స్వాగతం చెప్పాడు. ప్రేమతో అతడిని కౌగలించుకున్నాడు. సముచితంగా సత్కరించాడు. ఎంతో వినయంగా పూజించాడు. ఇంతటి గౌరవం పొందిన ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా.” అని అనుకున్నారు. అప్పుడు కృష్ణుడు ప్రేమతో కుచేలుడి చేతిలో తన చేయి వేసి పట్టుకుని, తాము గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన విశేషాలను ప్రస్తావించి, కృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు. "చక్కటి వేద పండితుల వంశంలో పుట్టిన సద్గుణశాలి అయిన నీ భార్య నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద, భార్యాపుత్రుల మీద లగ్నమైనట్లు కనిపించుట లేదు. లోకకల్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు లోకంలో కొందరు ఉత్తములు కామమోహాలకు వశం కాకుండా తమ విధ్యుక్తధర్మాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య నిష్ఠతో జీవిస్తారు. మనం గురువుగారి నివాసంలో ఉన్నప్పుడు ఆచార్యుడు బోధించగా నేర్చుకోవలసినవి మనం వరుసగా నేర్చుకుని గొప్ప విజ్ఞానము గడించిన సంగతి నీకు జ్ఞాపకం ఉందా? మన గురువు అజ్ఞానం అనే చీకటికి దీపం లాంటివాడు. బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు. సత్కర్మ పరాయణుడు. బ్రాహ్మణ శ్రేష్ఠుడు. పుణ్యాత్ముడు. సకల వర్ణాశ్రమాలవారికీ నేను నిజానికి విజ్ఞానప్రదాత అయిన గురువును అయినా గురుసేవ అత్యున్నత ధర్మము అని బోధించడం కోసం నేను కూడ గురుసేవ చేసాను. మనం గురువు గారి ఆశ్రమంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము. గుర్తుంది కదూ. ఆ సమయంలో పెద్ద పెద్ద ఉరుములతో ఆకాశం అంతా భీకరంగా కారుమబ్బులు ఆవరించాయి. సుడిగాలులు మహా వేగంతో వీచి అడవి జంతువులను ఎగరగొట్టసాగాయి. వర్షధారలు దిగ్గజాలతొండా లంత పరిమాణంతో భూమిపై వర్షించాయి. మెరుపులు మిరుమిట్లు గొలిపాయి. వాన జడి పెరిగింది. సూర్యుడు అస్తమించాడు. వర్షం ఆగలేదు. చీకట్లు దట్టంగా వ్యాపించి, కంటికి ఏమీ కనపడటం లేదు. అలాంటి జడివానలో మనం తడిసి ముద్దయ్యాము. త్రోవలూ డొంకలూ ఎత్తు పల్లాలూ కనపడకుండా వాననీరు కప్పివేసింది. ఒకరి చేతిని ఒకరం ఊతగా పట్టుకుని మనం ఆ అడవిలో దారి కనపడక తిరిగాము. తీవ్రంగా వీచే గాలులకు మనం విపరీతంగా వణకసాగాం. మనం ఏం చేయలో తోచక, దిక్కూ తెన్నూ తెలియక అడవిలో తెగ తిరిగాము. అప్పుడు, ఎట్టకేలకు సూర్యోదయం అయింది. అప్పుడు, మన గురువుగారైన సాందీపని మహర్షి మనలను వెదుక్కుంటూ వచ్చాడు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనల్ని చూసి విచారంతో ఇలా అన్నాడు. “అయ్యో! పిల్లల్లారా!మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కనుక, ఓ శిష్యులారా! మీరు మీ గురుఋణం తీర్చుకున్నారు. మీకు ధన దార బహు పుత్ర సంపదలూ దీర్ఘాయురున్నతులూ విజయశ్రీలు చేకూరగలవు.” అని ఆశీర్వాదించారు. ఇలా దీవించి, పిమ్మట గురువు సాందీపని వాత్సల్యంతో మనలను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీవు తలచుకుంటూ ఉంటావా?” అని కుచేలునితో శ్రీకృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు. పుణ్యాత్మా! అప్పుడు, మనం చదువుకుంటూ అన్యోన్య స్నేహవాత్సల్యాలతో మెలగిన తీరులు నీవు మర్చిపోలేదు కదా?” ఈ విధంగా శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి ముచ్చటలను గుర్తుచేసుకుంటూ పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు. దామోదరా! గురువుగారి ఆశ్రమంలో సంతోషంతో మనం చేయని పనులు ఏమైనా అసలు ఉన్నాయా? అది అలా ఉండనీ కాని నా మాట విను. మురారీ! ముల్లోకాలకూ గురుడవు అన తగిన నీకు గురుడు అంటూ ఇంకొకడు ఉంటాడా? తెలివిగా ఆలోచించి చూస్తే ఇదంతా నీ లీలలే తప్ప మరేమీ కాదు.” అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కుచేలుడితో “నీ విక్కడికి వస్తూ నా కోసం ఏమి తెచ్చావు? ఆ వస్తువు లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తి లేని నీచుడు మేరుపర్వత మంత పదార్థం ఇచ్చినా, అది నాకు అంగీకారం కాదు. అందుచేత పత్రమైనా ఫలమైనా పుష్పమైనా జలమైనా సరే భక్తితో నాకు సమర్పిస్తే దానిని మధురాన్నంగా భావిం చి స్వీకరిస్తాను.” అని అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలకూ కుచేలుడు సంతోషించి తాను తెచ్చిన అటుకులను శ్రీకృష్ణుడికి ఇవ్వలేక తలవొంచుకొని కూర్చున్నాడు. కుచేలుడు వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. పూర్వజన్మ నుండి ఇతడు ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించినవాడు కాదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా దగ్గరకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని సకల సంపదల్ని ఈక్షణమే ఇతనికి ఇవ్వాలని భగవంతుడు భావించాడు. తన చినిగిన ఉత్తరీయంలో ముడివేసి కుచేలుడు తీసుకువచ్చిన అటుకులను చూసి, కృష్ణుడు ఆలా అన్నాడు. ఇదేమిటి అని అడుగుతూ ముడి విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు, “నాకూ సమస్త లోకాలకూ సంతృప్తి కలిగించడానికి ఇవి చాలు.” అంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు. శ్రీపతి తీసుకున్న ఆ పిడికెడు అటుకుల్ని ఆదరంగా తిన్న తరువాత, మళ్ళీ ఇంకొక్క పిడికెడు తీసుకుంటున్నాడు. ఇంతలో, రుక్మిణీదేవి తన రెండు చేతులతో భర్త చేయి పట్టుకుని వారిస్తూ ఇలా అన్నది. ఓ శ్రీహరీ! ముజ్జగాలకు సంపద లొసగు వాడా! ఈ కుచేలుడికి సకల సంపదలను అందించడానికి మీరు ఆరగించిన గుప్పెడు అటుకులే చాలు. ఇక స్వీకరించకండి.”అలా భర్తను రుక్మిణీదేవి వారించింది. పిమ్మట, కుచేలుడు నాటి రాత్రి శ్రీకృష్ణుని మందిరంలో తనకు ఇష్టమైన రకరకాల పదార్ధాలు అన్నీ భుజించాడు. మెత్తని పానుపు మీద పవళించి తాను స్వర్గభోగాన్ని అనుభవిస్తున్నంతగా సంతోషించాడు. మరునాడు తెలవారగానే అతడు కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని, తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు తన అప్తమిత్రుడిని కొంతదూరం కూడా వచ్చి సాగనంపాడు. ఆ నందనందనుడు అయిన శ్రీకృష్ణుని దర్శించిన  ఆనందంతో నిండిన అక్కరతో కుచేలుడు వెళుతూ తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆహా ఏమి నాపుణ్యం? ఆ పుణ్యల రాశిని; పరమ శాంతుని; అచ్యుతుని; అఖిల వ్యాపకుని; చిన్మయ స్వరూపుని; పర మాత్మను; పురు షోత్తముని; శ్రీకృష్ణపరమాత్మను దర్శించ గలిగాను. మందుడను అయిన నే నెక్కడ? లక్ష్మికి నిత్యనివాస మైన వాసుదేవు డెక్కడ? అచ్యుతుడు అనురాగంతో నన్ను తన తోడబుట్టినవాడిలా కౌగిట చేర్చాడు. దేవుడితో సమానమైన వాడిలా భావించి తన పానుపు మీద కూర్చోబెట్టుకున్నాడు. పూని నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి రుక్మిణీదేవి నాకు వింజామర వీచింది. నా శ్రమను పోగొట్టింది. అతిశయించిన వాత్సల్యంతో శ్రీకృష్ణుడే సాక్షాత్తూ లక్ష్మీదేవిని లాలించే తన చందనాలు అలదిన పాణిపల్లవాలతో ఆప్యాయంగా నా పాదా లొత్తాడు. మహా సంపన్నుడు అయిన శ్రీకృష్ణుడు నన్ను గొప్పగా సత్కరించాడు. కానీ దరిద్రుడుకి సంపదలు లభిస్తే గర్వాంధుడై తనను సేవించడని కాబోలు ధనము మాత్రం ఏమీ ఇవ్వలేదు అనుకుంటాను. లేకపొతే ఆశ్రితజనుల ఆర్తిని బాపే అంబుజాక్షుడు, అపార కృపా సముద్రుడు, నాకు సకల సంపదలు అనుగ్రహించకుండా ఉంటాడా?” ఈ విధంగా ఆలోచనలతో కుచేలుడు పయనించి తన ఊరికి చేరుకున్నాడు. అక్కడ కుచేలుడు తన కళ్ళేదుట సూర్యచంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి మేడలు, శుక, పిక, మయూరాల కూజితాలతో అలరారే చక్కటి ఉద్యానవనాలు, వికసించిన అనేక వన్నెల తామరలతో కలువలతో కనులపండువుగా ఉన్న సరోవరాలు, మణికంకణాలు మున్నగు రకరకాల భూషణాలూ ధరించి ప్రకాశిస్తున్న దాస దాసీజనము కలిగిన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. “ఏ పుణ్యాత్ముని భవనమో ఇది సిరిసంపదలకు నిలయముగా అపూర్వంగా ప్రకాశిస్తున్నది.” ఇలా అనుకుంటూ సంకోచిస్తున్న సమయంలో దేవకాంతల వంటి యువతులు కుచేలుని దగ్గరకు వచ్చి, “ఇటు దయచేయండి.” అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో అతడిని అంతఃపురం లోనికి తీసుకుని వెళ్ళారు.కుచేలుడు ఇలా వస్తుండటం చూసిన ఆయన భార్య చాలా సంతోషించింది. ఆ ఇల్లాలు తన భర్త ఎదురుగా వస్తుంటే చూసి, ఎంతో ఆనందంతో ఎదురువచ్చింది. అప్పుడు ఆమె అపర మహాలక్ష్మిలా ఉంది. కృష్ణుని అనుగ్రహంవలన కలిగిన ఐశ్వర్య వైభవాలకు ఆ భార్యాభర్తలు ఇద్దరు అత్యంత ఆనందాన్ని పొందారు. ఆ భవనం లోనికి కుచేలుడు సతీసమేతంగా ఆనందంగా ప్రవేశించాడు. కుచేలుడు ఆ దివ్యభవనంలో ఎలాంటి మనోవికారాలకూ లోనుకాకుండా సుఖంగా జీవిస్తూ, తన నిర్మలమైన మనసున ఇలా అనుకున్నాడు “ఇన్నాళ్ళూ దుర్భరమైన దారిద్ర్య దుఃఖసాగరంలో తపించాను. ఇప్పుడు చివరికి ఈ వైభవం కలిగింది. ఈ సరిక్రొత్త సంపదలు సమస్తం శ్రీహరి కృపాకటాక్షం వలననే నాకు ప్రాప్తించాయి కదా. నేను శ్రీకృష్ణుని సన్నిధికి అర్థకాంక్షతో వెళ్ళడం ఆ మహానుభావుడు నా సంగతి అంతా గ్రహించినా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపాడు. ఈ సకల సంపదలూ అనుగ్రహించి ధనవంతుడిని చేసాడు. భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. 













భగవద్గీత-అధ్యాయం13-శ్లోకం4

 భగవద్గీత

అధ్యాయం 13

శ్లోకం 4

ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్|

బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ||

అర్థం :-

క్షేత్ర, క్షేత్రజ్ఞులతత్త్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. వివిధ వేదమంత్రాలు వేర్వేరుగా తెలిపాయి . ఆలాగే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగ సహేతుకముగా తేటతెల్లము చేసాయి.



భగవద్గీత-అధ్యాయం13-శ్లోకం 3

 భగవద్గీత

అధ్యాయం 13

శ్లోకం 3

త్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |

స చ యో యత్ర్పభావశ్చ తత్సమాసేన మే శృణు||

అర్ధం:-

క్షేత్రమనగానేమి? అది ఏలా ఉంటుంది? దాని భావములు ఏవి? ఆవికారములు దాని నుండి ఏర్పడినవి? ఆలాగే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? ఆతని ప్రభావమేము? ఆవివరములను అన్నింటిని సంక్షిప్తముగా చెబుతాను విను.



భగవద్గీత-అధ్యాయం13-శ్లోకం2

 భగవద్గీత

అధ్యాయం 13

శ్లోకం 2

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |

క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||

అర్ధం:-

ఓ అర్జునా! అన్ని క్షేత్రముల యందు క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకో. క్షేత్రక్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికారసహిత ప్రకృతి మరియు నిర్వికారపురుషుల తత్త్వములను గూర్చి తెలుసుకొవటమే జ్ఞానము అని నా అభిప్రాయము.




రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...