శ్రీకృష్ణ -సాల్వ యుద్ధం



శ్రీకృష్ణుడుని చుసిన సాల్వుడు భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని కృష్ణుడి రథసారథి అయిన దారుకుడి మీద ప్రయోగించాడు. అది ఆకాశం నుండి రాలిపడే కాంతిమంతమైన నక్షత్రంలా దూసుకు వస్తోంది. శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడు ఒక్క బాణంతో మార్గం మధ్యలోనే పొడిపొడి చేసి నేలరాల్చాడు. కృష్ణుడు అంతటితో శాంతించకుండా మొక్కవోని పరాక్రమంతో కొరవి త్రిప్పుతున్నట్లు ఆకాశంలో గిరగిర తిరుగుతూ దుర్నరీక్ష్యంగా ఉన్న ఆ సౌభకాన్నీ అందులోని సాల్వుడిని తీక్షణమైన సూర్యకిరణాలతో సమానమైన పదహారు బాణాలను వేసి నొప్పించాడు. సాల్వుడు కోపంతో తన ధనుస్సును మేఘగర్జనలా మ్రోగిస్తూ కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేలా వాడి బాణాలు వేసాడు. అ దెబ్బకు కృష్ణుడు శార్ఙ్గము అనే పేరు కల తన ధనుస్సును రథంమీద జారవిడిచాడు. ఆకాశంలో దేవతలు భయపడుతూ చూడసాగారు. రథంలోని కృష్ణుడు తెప్పరిల్లడం చూసి, అహంకారి అయినా సాల్వుడు ఉత్సాహంతో ఇలా అన్నాడు. ఇప్పుడు రణరంగంలో బెదిరి పారిపోకుండా నా ఎదుట ధైర్యంగా నిలబడితే నా మిత్రుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా కర్కశ బాణాగ్ని జ్వాలలలో ముంచి పగతీర్చుకుంటాను." ఇలా అంటున్న సాల్వుడితో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. “ఓరోరి! మూర్ఖుడా! గొప్ప బలము, పరాక్రమం కల వీరుడిలా వాగుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు.” అని పలికి తన గధాయుధాన్ని గిరగిర త్రిప్పి ఎదురుగా వస్తున్న సాల్వుడి మీదకు విసిరాడు. శ్రీకృష్ణుని గదాఘాతంచేత సాల్వుడి నోటినుండి ముక్కునుండి రక్తం కారుతుండగా స్పృహ తప్పాడు. కొంతసేపటికి తేఱుకుని తెలివి తెచ్చుకున్నాడు. వెనువెంటనే సౌభకంతోపాటు అదృశ్యమయడు. కొంతసేపట్టి తరువాత సాల్వుడు పంపిన మాయ దూత శ్రీకృష్ణుడి దగరకు వచ్చి ప్రభూ! శాల్వుడు మీతండ్రి వసుదేవుడిని బంధించి తెచ్చిన వార్త మీకు చెప్పవలసిందిగా దేవకీదేవి నన్ను మీ దగ్గరకు పంపించారు.” అది వినిన శ్రీకృష్ణుడు తండ్రిమీద ఉన్న మమకారం వలన విషాదంలో మునిగిపోయాడు. శ్రీకృష్ణుడు భగవంతుదైనా మానవుడిగా పుట్టినందుకు కొంతసేపు అదినిజమే అనికొని భ్రమపడాడు. కొంతసేపట్టి తరువాత “మానవ గంధర్వ దేవరాక్షసాదులకు అయినా జయింప సాధ్యం కాని బలరాముడు జాగరూకతతో రక్షిస్తూ ఉండగా, బలహీనుడైన సాల్వుడి చేత వసుదేవుడు ఎలా పట్టుబడతాడు.” అని శ్రీకృష్ణుడు భావించాడు. ఆ దూత మళ్ళీ కనిపించి మాయావసుదేవుడిని కల్పించి, అతనిని బంధించి తీసుకు వచ్చి “ఓ కృష్ణా! పుండరీకముల వంటి కన్నులు ఉన్నాయి కదా చూడు. వీడే నీ తండ్రి నీ కన్నుల ముందే వీడి తల నరికేస్తాను. ఇక ఎవరి కోసం బ్రతుకుతావు? ఇక చాతనైతే రక్షించుకో.” అని దుర్భాషలు పలుకుతూ, భీకరమైన పెద్ద కత్తి జళిపిస్తూ, ఆ మాయావసుదేవుడి తల తరిగి, ఆ శిరస్సు పట్టుకుని సౌభకవిమానం లోనికి వెళ్ళిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కొంతసేపు బాగా దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తన సైనికులచే గుర్తు చేయబడి, అది సాల్వుడు ప్రయోగించిన మయ నిర్మిత మాయ అని కృష్ణుడు గ్రహించాడు. ఆ క్షణం లోనే వసుదేవుడు పట్టుబడ్డాడు అని చెప్పిన దూత, ఆ మాయాకళేబరం అదృశ్యం అయిపోయాయి. సమయంలో, మునులు కొంతమంది వచ్చి, మాయా మోహితుడైన కృష్ణుడిని చూసి, చిక్కని భక్తితో నమస్కరించి “ఓ పుండరీకాక్షా! పురుషోత్తమా! సమస్తమైన లోకాలలో ఉన్న మానవులు అందరు రకరకాలుగా సంసారం అనే దుఃఖసముద్రంలో మునిగి దరి చేరలేక కొట్టుమిట్టాడుతున్న దశలో నిన్ను స్మరించి ఆ దుఃఖాలను పోగొట్టుకొంటారు. అలాంటి సద్గుణాలకు నిధివై; దేవతాసమూహానికి ఆధారభూతుడవై; పరబ్రహ్మ స్వరూపుడవై; పరమయోగీశ్వరులకు కూడా అందనివాడవై; చిదానందరూపంతో ప్రకాశించే నీ వెక్కడ? అజ్ఞాన సంజాతాలు అయిన శోక, మోహ, భయాదు లెక్కడ? అవి నిన్ను అంట లేవు.” అని ఈ విధంగా ప్రస్తుతించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు. అప్పుడు తన మీద పదునైన బాణాలను గుప్పిస్తున్న సాల్వుడిని చంపటానికి శ్రీకృష్ణుడు నిశ్చయించుకొని, తన తిరుగులేని తీవ్రమైన బాణాలను వర్షధారలవలె ప్రయోగిస్తూ ఆకాశాన్ని కప్పివేసి శత్రువు కిరీటాన్నీ ధనుస్సునూ కవచాన్నీ ఛేదించి వేశాడు. మహాక్రోధంతో శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాతమైన వీరవిజృంభణంతో ఆకాశంనిండా మెరుపులు వ్యాపించేలా గదాదండాన్ని విసిరి సాల్వుడి సౌభకవిమానాన్ని తున్నాతునకలు చేసాడు. ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు. సాల్వుడు భయంకర గదను చేతబట్టి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ గదతో సహితంగా వాడి చేతిని ఖండించివేసాడు. అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సాల్వుడి మీద ప్రయోగించి తలను ఖండించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుడిని సౌభకవిమానాన్నీ ధ్వంసం చేయటం చూసిన దంతవక్త్రుడు మిక్కిలి భయంకరాకారంతో కృష్ణుడి మీదకు వచ్చాడు. దంతవక్త్రుడు తన గదాదండంతో కృష్ణుడి తలమీద మోదాడు.శ్రీకృష్ణుడు ఆగ్రహించి గదతో వాడి వక్షస్థలాన్ని పగులకొట్టడంతో, వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు. తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు. దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవ దుందుభులు మ్రోగుతుండగా, యాదవ వీరులు సేవిస్తుండగా, వందిమాగధులు తన విజయ గాథలను గానం చేస్తుండగా, బహు మనోజ్ఞములైన వైభవాలతో, నందనందనుడు పరమానందంతో ఒక శుభముహుర్తంలో నవ్యనూతన అలంకారాలతో విరాజిల్లుతున్న ద్వారకానగరం ప్రవేశించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...