రాజసూయ యాగం



శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం ధర్మరాజు వేదవిజ్ఞానధనులైన బ్రాహ్మణులను యజ్ఞకార్యనిర్వాహకులుగా స్వీకరించాడు.సత్యవతీ కుమారుడు వేదవ్యాసుడు, కశ్యపుడు, ఉపహూతి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వీతిహోత్రుడు, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, మధుచ్ఛందుడు, గౌతముడు, సుమతి, భార్గవుడు, వసిష్ఠుడు, వామదేవుడు, అకృతవ్రణుడు, కణ్వుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, అధర్వుడు, కవషులు, అసితుడు, వైశంపాయనుడు, ఆసురి, దుర్వాసుడు, క్రతువు, వీరసేనుడు, గర్గుడు, త్రికవ్యుడు మొదలైన మునీశ్వరులనూ; ద్రోణుడు, కృపాచార్యుడు ఆది గురువులనూ; భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మున్నగు కురువృద్ధులనూ; దుర్యోధనాది బంధుజనాన్నీ; అలా గురు బంధు మిత్ర కులవృద్ధులను అందరినీ, సమస్త బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్ర ముఖ్యులనూ; ధర్మరాజు తన యజ్ఞానికి రప్పించాడు. ధర్మరాజు ఆహ్వానించిన వారంతా విచ్చేసి సంతోషంతో ఉచిత కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండగా, బ్రాహ్మణశ్రేష్ఠులు శాస్త్ర ప్రకారం యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞభూమిని బంగారునాగళ్ళతో దున్నించి, సువర్ణమయమైన పరికారాలతో ఏలోపం రాకుండా పంచపాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు యజ్ఞదీక్ష ఇచ్చారు. అలా బ్రాహ్మణులు నియమం ప్రకారం ఉచితమైన కార్యకలాపాలు నడుపుతున్నారు. ఆ సమయంలో ధర్మరాజు సమస్తభూపతులూ తనకు సమర్పించే ధన, కనక, వస్తు, వాహనాదులైన కానుకలను స్వీకరించటానికి దుర్యోధనుడిని నియమించాడు. కర్ణుడిని యాచకులు అడిగిన వస్తువులను దానం చేయటానికి; భీముడిని షడ్రసోపేత భోజనపదార్థాలను తయారు చేయించటానికి; శ్రీకృష్ణుడికి సేవలు చేయటానికి అర్జునుడిని; నకులుడిని యజ్ఞానికి అవసరమైన సంబారాలను సమకూర్చటానికి; సహదేవుడిని దేవతలను బ్రాహ్మణులను గురువులను పెద్దలను గౌరవించటానికి; యాగానికి విచ్చేసిన సమస్త ప్రజలూ మృష్టాన్నపానాలతో సంతుష్టులయ్యేలా చూడడానికి ద్రౌపదినీ; ధర్మరాజు నియమించాడు. దేవేంద్రుడు మొదలైన దిక్పాలురూ; బ్రహ్మాది దేవతలూ; సిద్ధ, సాధ్య, కిన్నర, చారణ, గరుడ, నాగ మున్నగు దేవగణములు; వచ్చి ధర్మరాజు చేస్తున్న యజ్ఞాన్ని చూసారు. “ఇంతకు పూర్వం యే రాజు కూడా ఇంత గొప్పగా యజ్ఞం చేయలేదు అని మెచ్చుకున్నారు. అంతేకాకుండా, “శ్రీకృష్ణుడి పాదపద్మాలు పూజించే భాగ్యం పొందిన వారికి, పొందలేని దంటూ ఏదీ ఉండదు” అని బ్రహ్మాదులు ప్రస్తుతించారు. దేవతలతో సమానులైన ఋత్విక్కులు రాజసూయ యాగానికి అనువైన మంత్రాలతో హవ్య ద్రవ్యాలను ధర్మరాజుచేత వేలిపించి యాగాన్ని నడిపించారు. ధర్మరాజు ఋత్విక్కులనూ, సభాసదులనూ, పెద్దలనూ, బ్రాహ్మణులనూ యజ్ఞం పరిసమాప్తమైన చివరిదినం పూజించాలని భావించాడు. అలా యాగాంతంలో పెద్దలను పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హులు ఎవరు అని అడుగగా, సభలో ఉన్నవారు ఎవరికి తోచినట్లు వారు తలకొక రకంగా చెప్పసాగారు. వారి మాటలను వారించి, వాక్ చాతుర్యం కలవాడు, బుద్ధిమంతుడు ఐన సహదేవుడు కృష్ణుడిని చూపించి “ఈ మహాత్ముడిని సంతుష్టుణ్ణి చేస్తే సమస్త లోకాలూ సంతోషిస్తాయి.” అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు. “కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్త, భోక్త, లోకాలు, దైవము, గురువు, మంత్రము, అగ్ని, ఆహుతులు, యాజికులు, సృష్టిస్థితిలయాలూ, సమస్తము తానే అయి ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ శ్రీకృష్ణపరమాత్ముడు ఒక్కడే. అటువంటి ఈ శ్రీకృష్ణుడు కనుక, కన్నులు కొద్దిగా మూసుకున్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పిచూస్తే ఈలోకాలన్నీ జనిస్తాయి. యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు, ప్రభవిష్ణుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఐన శ్రీకృష్ణుడే ఈ అగ్రపూజకు అర్హుడు. ఇతడు కాకపోతే మరెవ్వరు తగినవారు కాగలరు? పురుషోత్తముడు, సకలలోకాధిపతి, అనంతుడు సమస్తశక్తులు కలవాడు, చిద్రూపుడు అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింప చేస్తే సమస్త లోకాలూ సంతృప్తి పొందుతాయి. కాబట్టి, వేలమాటలు ఎందుకు, నీవు ఆలస్యం చేయకుండా అన్యధా ఆలోచించకుండా ఈ లక్ష్మీపతికి, శ్రీకృష్ణుడికి అగ్ర పూజ చెయ్యి.” అని సహదేవుడు చెప్పగా ఆ సభాసదులు, రాజులు, ఋషులు మొదలైన వారందరూ సంతోషంతో “ఇదే సముచిత మైనది” అని అంగీకరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...