ఊసరవెల్లికి శాప విమోచనం కలిగించిన్నా శ్రీకృష్ణుడు

 


ఒకరోజు శ్రీకృష్ణుడి కుమారులు ఐన ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలైన యాదవ కుమారులు మిక్కిలి వైభవంగా ఉద్యానవనానికి వెళ్ళారు. స్వేచ్ఛగా ఆ ఉద్యానవనంలో విహరించి అలసిపోయారు. దాహం తీర్చుకోవడానికి నీటి కోసం వెదికారు. ఒకచోట, వారికి ఒక నీరు లేని పాడుబడ్డ బావి కనిపించింది. దానిలో ఉన్న పెద్దగా కొండంత ఉన్న ఊసరవెల్లిని చూసి, వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఊసరవెల్లిని బావిలో నుంచి బయటకు తీయాలని అనుకున్నారు. వారంతా పరుగు పరగున వెళ్ళి, పెద్ద పెద్ద తాళ్ళు తీసుకుని వచ్చారు. గొప్ప భుజబలం కల ఆ వీరులు ఆ ఊసరవెల్లిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వారు వెంటనే వెళ్ళి శ్రీకృష్ణుడితో ఈ విషయం విన్నవించారు. పద్మాక్షుడు ఈ విషయం విని ఆశ్చర్యపడి, ఆ నీరులేని బావి దగ్గరకు వచ్చి, తన ఎడమచేతితో ఆ ఊసరవెల్లిని ఒక గడ్డిపరకను తీసినంత అవలీలగా బయటకు తీసాడు. అంతలో ఆ ఊసరవెల్లి బంగారురంగుతో శోభిల్లే పురుష రూపాన్ని పొందింది. అతనిని చూచి శ్రీకృష్ణుడు అతని వృత్తాంతం తనకు తెలిసినా కూడా, తన కుమారులకూ మిగిలిన జనాలకు తెలియడం కోసం. అతని కథను అతని చేతనే చెప్పించాలి అనుకుని అతనితో ఇలా అన్నాడు. “ఓ విచిత్ర చరిత్రుడా! చాలా విచిత్రంగా ఉంది. రత్నభూషణాలను ధరించి అసమానమైన కీర్తిని గడించి మహనీయమూర్తివై భూలోకంలో విలసిల్లే నీకు ఊసరవెల్లి రూపం ఎలా కలిగింది. నీ వృత్తాంతం అంతా మాకు వివరంగా చెప్పు” అని శ్రీకృష్ణుడు అడుగడంతో ఆ పురుషుడు మురారి పాదపద్మాలకు తన కిరీటం మణులు సోకేలా నమస్కరించి, తన నుదుట చేతులు మోడ్చి, ఆనందంతో ఇలా విన్నవించాడు. మహానుభావ! నీవు సర్వజ్ఞుడవు. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం ఏదీ లేదు. అయినా, నా ద్వారా వినాలని భావించావు గనుక, అలాగే చెప్తాను.     నేను ఇక్ష్వాకుని పుత్రుడను. నా పేరు నృగుడు. నేను రాజులు అనేకులు నన్ను సేవిస్తుండగా బహు సమర్థవంతంగా రాజ్యపాలన సాగించాను. దీనులను పోషించాను. పెంపొందిన అనంత కీర్తిసంపదలతో శోభించాను. శ్రీకృష్ణా! తనను తాను పొగడుకోవడం పాతకమని పెద్దలు అంటారు. కానీ మీరు చెప్పమన్నారు కనుక చెప్తాను. తారలను, ఇసుక రేణువులను, మంచు బిందువులను లెక్కించవచ్చు. కాని నేను బ్రాహ్మణశ్రేష్ఠులకు దానాలు ఇచ్చిన గోవులను లెక్కించడానికి బ్రహ్మకు కూడా శక్తి చాలదు. ఏమిచెప్పేది. అంతే కాదు అచ్యుతా! తపోనిధులు, వేద పండితులు, విహితకర్మలను ఆచరించే గృహస్తులూ ఐన బ్రాహ్మణులకు బంగారుకొమ్ములు గిట్టలు కలిగి, తొలిచూలు దూడలు కల పాడిఆవులను దక్షిణతోపాటు ఘనంగా దానం చేశాను. అంతేకాకుండా, న్యాయసముపార్జిత మైన ధనంతో నేను గోదానం, భూదానం, బంగారుదానం, రత్నదానం, గృహదానం, రథదానం, గజదానం, అశ్వదానం, సరస్వతీదానం, వస్త్రదానం, తిలదానం, కన్యాదానం, మొదలైన దానాలను ఎన్నింటినో చేసాను. పంచమహాయజ్ఞాలు నెరవేర్చాను. బావులను, దిగుడు బావులను, చెఱువులను, వనాలను, నిర్మింపజేశాను. ఇలా దానధర్మాలు చేస్తూ ఉండగా ఒక రోజున ఒక విశేషం జరిగింది. ఓ పుణ్యపురుషా! అంతకు ముందు నేను కశ్యపుడనే విప్రుడికి పవిత్ర హృదయంతో దానముగా ఇచ్చిన గోవు తప్పిపోయి తిరిగివచ్చి నా ఆలమందలో కలసిపోయింది. అది తెలియని, నేను ఆ గోవును ఇంకొక బ్రాహ్మణోత్తమునకు దానముగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ఆవును తోలుకుని వెళుతూంటే, ఇంతకు ముందు నాచే దానం పొందిన కశ్యపుడు ఆ గోవును చూసాడు. అలా చూసిన కశ్యపుడు,మిక్కిలి రోషంతో ఊడిపోతున్న దోవతి బిగించి, ఆవును తోలుకుని వెళ్ళే బ్రాహ్మణుని దగ్గరకు వేగంగా వెళ్ళి “ఇది నా ఆవు. దానిని దొంగిలించి నడివీధిలో తోలుకుని పోతున్నావు. ఇటువంటి వారు ఎక్కడైనా ఉంటారా” అన్నాడు.ఆ మాటలు వినిన గోవును తోలుకుని వెళుతున్న బ్రాహ్మణుడు కశ్యపునితో “ఈ ఆవును నేను రాజుగారి దగ్గర దానంగా స్వీకరించాను. ఈ గోవు నీది అంటున్నావు. ఇదేమిటి” అన్నాడు అప్పుడు కశ్యపుడు “ఈ ఆవును రాజుగారే నాకు దానంగా ఇచ్చారు” అని అన్నాడు. ఈవిధంగా ఇద్దరు బ్రాహ్మణులకూ అక్కడ పెద్ద వివాదం జరిగింది..అంతకంతకూ పట్టుదలలు పెంచుకుని బాగా కలహించుకుని, ఆ బ్రాహ్మణులు ఇద్దరూ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు కశ్యపుడనే బ్రాహ్మణుడు నాతో ఇలా అన్నాడు.“ఓ రాజేంద్రా! నీవు ప్రజలను అధర్మమార్గంలో నడవకుండా నియంత్రించాల్సిన వాడవు. నీవే ధర్మము తప్పావు. ఇంతకు ముందు నాకు దానమిచ్చిన ఈ గోవు తప్పిపోయి నీ మందలో కలసిపోయింది. దీనిని ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు. నీవు ఏ విధంగా అధర్మమైన ఈ పని చేసావు. ఇలా ధర్మం తప్పి దానకర్తవు అవహర్తవు రెండూ నీవే అయ్యావు. కాని నిన్ను ఏమనగలము.” అన్నాడు ఈమాటలకు నేను బాధపడి “ఓ బ్రాహ్మణోత్తమా తెలియక ఈ పొరపాటు జరిగింది. ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు. దీనికి బదులుగా నీకు లక్షగోవులను దానమిస్తాను. స్వీకరించు.” అన్నాను. ఇంకా ఆ బ్రాహ్మణుని రకరకాలుగా బతిమాలి, ప్రాధేయపడి, “మహాత్మా నన్ను నరకకూపం నుండి రక్షించండి” అని ప్రార్థించాను. నేను ఎంత వేడుకుంటుంటే అతనిలో మచ్చరం అంత పెచ్చుపెరిగిపోయింది. “మొదట నీవు నాకు ఇచ్చిన గోవును తప్ప, నీవు నీ రాజ్యమంతా ఇస్తాను అన్నా నేను అంగీకరించను” అని చెప్పి అక్కడ నుంచి విసవిసా వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన తరువాత రెండవ బ్రాహ్మణుడిని ఆ గోవును ఇవ్వమని ప్రార్థించాను. అతడు కూడా పట్టుదలతో “నీవు పదివేల గోవులను ఇచ్చినా, నాకు అవసరం లేదు. నాకు ఈ గోవే కావాలి.” అని అతను కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు. ఆ తరవాత కాలం పరిపూర్తి కాగా నన్ను యమభటులు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు ముందు నిలిపారు. యమధర్మరాజు నాతో ఇలా అన్నాడు. “ఓ మహారాజా! నీవు చేసిన దానాలు యజ్ఞాలు ముల్లోకాలలో ప్రఖ్యాతి గాంచాయి, నీ పాపఫలాన్ని మొదట నీవు అనుభవించు. అటుపిమ్మట స్వర్గ సౌఖ్యాలను అనుభవించు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ దాటరానిది కదా.” ఇలా పలికి యముడు నన్ను అక్కడ నుండి త్రోసివేయించాడు. భూమిపై పడేటప్పుడే నాకు ఈ ఊసరవెల్లి రూపం సంభవించింది. ఇంతకాలం ఆ దోషం పోవడానికే, ఈ దురవస్థ పొందవలసివచ్చింది, ప్రాణులు తమ తమ పుణ్యపాప ఫలాలను రెండింటినీ అనుభవించాలి తప్పదు. అవి ఊరకేపోవు. ఇదిగో ఇవాళ సమస్త దోషాలను పోగొట్టగల నీ పాదపద్మాలను దర్శించడంతో, ఆ ఘోరదుర్దశ నుండి బయటపడ్డాను. నిర్మల హృదయుడను అయ్యాను.” అని నమస్కరించి ఇంకా ఇలా ప్రార్థించాడు. శ్రీకృష్ణా! వాసుదేవా! కేశవా! హరీ! ముకుందా! నిన్ను దర్శించగలిగాను. నీ కృపను పొందగలిగాను. సమస్త సౌఖ్య పదవులను అందుకోగలిగాను.” ఇలా అనేక విధాలుగా స్తుతించి ఆ నృగుడు గోపాల ప్రభువు శ్రీకృష్ణుడి చరణారవిందాలకు నమస్కరించాడు. “దేవా! నీ పాదపద్మాలు నా హృదయ పద్మ మందు స్థిరపడునట్లు అనుగ్రహింపుము.” అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుని అనుజ్ఞ గైకొని అక్కడ చేరిన వారందరూ ఆశ్చర్యానందాలు పొందుతుండగా నృగమహారాజు ఒక దివ్యవిమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాకుమార శ్రేష్ఠులకు ఇలా ధర్మబోధ గావించాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...