ద్వారకాలో సర్వం శ్రీకృష్ణుడిని దర్శించిన నారద మహర్షి


శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి, అతని మందిరంలో ఉన్న పదహారువేల మంది అందగత్తెలనూ వరించి, ఒకేమారు అందరికీ అన్ని రూపాలతో కనపడుతూ వివాహం చేసుకున్నాడు అనే వార్త నారదుడు విన్నాడు. ఒకనాడు ఆ కృష్ణవైభవం దర్శించాలనే కోరికతో ద్వారకకు వచ్చాడు. అప్పుడు విశ్వకర్మ చేత నిర్మించబడ్డ అంతఃపురంలోని పదహారువేల సౌధాలలోనూ శ్రీకృష్ణుడిని దర్శించాడు. బంగారు సింహాసనంమీద కొలువుతీరి కూర్చున్న పద్మాక్షుడు శ్రీకృష్ణుడిని ఆ మహర్షి తిలకించాడు. తన వద్దకు వస్తున్న నారదమునిని చూసి శ్రీకృష్ణుడు ఎదురు వచ్చాడు. నరద మహర్షిని ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసి తన సింహాసనం పై కూర్చోపెట్టాడు. “ఓ తాపసోత్తమా! మీరు ఏ పని చేయమని ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాను. సెలవీయండి.” ఇలా పలికిన కృష్ణుడితో నారదుడు ఇలా అన్నాడు. “ఓ దామోదరా! నీ అవతార లక్ష్యం దుర్మార్గులను శిక్షించడానికే కదా! నీవు సమస్తలోకాలకూ ప్రభుడవు; దయా పూరిత మానసుడవు; ప్రపంచాన్ని రక్షించేవాడవు; ఆర్తులకు బాంధవుడవు; అయిన నీవు ఏ పని అయినా చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కాదు. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతల చేత పూజింపబడే ఓ కృష్ణా! సంసారసాగరాన్ని దాటడానికి సాధనము; మోక్షాన్ని ప్రసాదించేదీ; ఐన నీ పదధ్యానం నా ఆత్మలో నిలిచి ఉండేలా అనుగ్రహించు.” ఆ విధంగా ప్రార్థించి నారదుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాడు. ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన ఆ దేవర్షి నారాదుడు వాసుదేవుడి యోగమాయా ప్రభావం తెలుసుకోవాలి అనుకున్నాడు. వేరొక భవనానికి వెళ్ళాడు. అక్కడ ఉద్ధవునితో కలసి పాచికలు ఆడుతున్న శ్రీకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కృష్ణుడిచేత పూజించబడి ఆ భవనం నుండి బయటకు వెళ్ళాడు. నారదుడు ఇంకొక భవనానికి వేళారు అక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణి దేవితో మాట్లాడుతూ కనిపించాడు. నారదముని వేరొక పద్మాక్షి భవనానికి వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణుడిని దర్శించాడు. ఈవిధంగా వాసుదేవుని కనుగొంటూ వెళుతూ ఉన్న నారదుడిని కృష్ణుడు ఒక ఇంటిలో గౌరవించి “నారద మునీంద్రా! ఏ కోరికలూ లేని మిమ్ములను కోరికలు కల మేము ఏవిధంగా సంతృప్తి పరచగలం మీ దర్శనంతో సమస్త శుభాలనూ పొందుతాము.” అని ప్రీతి పూర్వకంగా పలికాడు. కృష్ణుడి మాటలకు మన స్ఫూర్తిగా సంతోషించి చిరునవ్వు నవ్వుతూ నారదుడు ముందుకు సాగిపోయాడు. నారదుడు ఒక స్త్రీరత్నం ఇంటిలో జలకేళి ఆడుతూ ఆనందిస్తున్న ముకుందుడిని చూసాడు. నారదుడు మరొక  ఇంటిలో యోగనిష్ఠలో ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. ఒక ఇంటిలో సంధ్యావందనం చేస్తూ ఉన్న శ్రీకృష్ణుడిని ; మరొక గృహంలో పురాణశ్రవణం చేస్తూ ఉన్న శ్రీకృష్ణుడిని ; ఒక చోట పంచయజ్ఞాలు ఆచరిస్తున్నా శ్రీకృష్ణుడిని మరొక తావున యోగసమాధి నిమగ్నమై ఉన్న శ్రీకృష్ణుడిని ; ఒక స్థలంలో స్నానానికి సిద్ధమవుతూ ఉన్న శ్రీకృష్ణుడిని; ఇంకొక చోట ప్రశస్త భూషణాలతో ప్రకాశిస్తున్న శ్రీకృష్ణుడిని; మరొక ప్రదేశంలో గోదానం చేయాలని కుతూహలపడుతూ ఉన్న శ్రీకృష్ణుడిని; ఇంకొక ప్రదేశంలో తన కుమారులతో ఆడుకుంటున్న శ్రీకృష్ణుడిని ; ఒకచోట సంగీతం మీద ఆసక్తిని చూపుతున్న శ్రీకృష్ణుడిని; మరొక చోట జలకేళి ఆడుతున్నా శ్రీకృష్ణుడిని; ఇంకొక చోట మంచం మీద కుర్చున్న శ్రీకృష్ణుడిని; మరొకచోట బలరాముడి తో కలిసి ఉన్న శ్రీకృష్ణుడిని, యిలా పలుస్థలములలో పలుక్రియలలో నిమగ్నుడై యున్న శ్రీకృష్ణుడిని నారదమహర్షి సందర్శించాడు. శ్రీకృష్ణుడు తన ముద్దులసఖితో ఒక ఇంటిలో ముచ్చటలు ఆడుతున్నాడు; మరో ఇంటిలో మరొక ప్రియసఖితో సరసమాడుతున్నాడు; ఇంకో ఇంటిలో ఒక స్త్రీ రత్నం కోసం హారాలు గుచ్చుతున్నాడు; ఒక ఇంటిలో తన యువతితో కలిసి తాంబూలం సేవిస్తున్నాడు; ఒక ఇంటిలో నవ్వుతున్నాడు; ఒక ఇంటిలో పాడుతున్నాడు; ఒక ఇంటిలో సుఖగోష్టి చేస్తున్నాడు; ఒక ఇంటిలో ఆనందిస్తున్నాడు; ఈ మాదిరి అనేక రూపాలతో కనపడుతూ ఉన్న శ్రీకృష్ణభగవానుడిని దర్శిస్తూ నారదుడు ముందుకు సాగిపోయాడు. మరో మందిరంలో  కృష్ణుడిని కొడుకులూ, మనుమళ్ళూ, కూతుళ్ళూ, భార్యలు మున్నగు వారితో కలసి సామాన్య గృహస్థు వలె ఉండగా దర్శించాడు. మహాపురుషుడైన శ్రీకృష్ణుడు పదహారువేల స్త్రీల నివాసాలలోనూ ఏ స్త్రీ ఇంటిని వదిలిపెట్టకుండా, ప్రతి ఇంట తన మాయా ప్రభావంతో తానే ఉంటూ; ఒక ఇంటిలో ఏనుగులపై గుఱ్ఱాలపై స్వారీచేస్తున్నాడు. ఒక ఇంటిలో భోజనం చేస్తున్నాడు. ఇంకొక ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఇలా ఉన్న నిర్మలుడూ, కోరిన వరాలను అనుగ్రహించే వాడూ, బ్రాహ్మణ్యుడూ అయిన ఆ కృష్ణపరమాత్మను నారదుడు దర్శించాడు. అప్పుడు నారదుడు శ్రీకృష్ణునితో “నీ భక్తి అనే అమృతములోని తీయదనములో తేలియాడుతుండే పుణ్యాత్ములు మాత్రమే నీ తత్వాన్ని తెలుసుకోగలరు. అంతే తప్ప, ముల్లోకాలలో బ్రహ్మేంద్రాది దేవతలూ మహర్షులూ సహితంగా ఇతరులు నీ మాయను తెలుసుకోలేరు.” ఈవిధంగా పలికి నారదమహర్షి ఆనందంతో “ఇంక నేను సెలవు తీసుకుంటాను. లోకాలు అన్నింటినీ పవిత్రము చేసేది, సజ్జనులకు ఇష్టమైనదీ అయిన నీ నామసంకీర్తనం సమస్త లోకాలలోనూ ప్రకటిస్తాను” అని అన్నాడు. శ్రీమన్నారాయణుని నామస్మరణ చేసుకుంటూ అక్కడినుండి వెళిపోయాడు.










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...