శిశుపాలుని వధ


అంతలో, కృష్ణుని మేనత్త శ్రుతశ్రవస, చేది దేశ రాజు దమఘోషుల కుమారుడైన శిశుపాలుడు ఆ వైభవాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అసూయతో మనసులోని భయాన్ని వీడి తన చేతులెత్తి ఆసనం దిగి, నిలబడి శ్రీకృష్ణుడు వినేలా సభాసదులతో ఇలా అన్నాడు. “ఆహా! భలే! భలే! ఎలాంటి కాలం వచ్చేసింది, దీనిని దాటడం చాలా దుర్లభంగా ఉంది. ఈ కాల ప్రభావం చూడండి, ఇంత పసివాడి మాటలకి బుద్ధిమంతులైన ఈ పెద్దల బుద్ధులు నీతిని ఎలా తప్పాయో? నీతి తప్పాయని ఎలా అంటున్నావు అంటారా! యోగ్యత అయోగ్యతలనూ నిర్ణయించ గలిగిన మహా వివేకులు, గొప్ప సత్త్వగుణ సంపన్నులు, పాపరహితులు, సకల విధ మహా తపస్సులు, వ్రతశీలులు, మహా నియమ పాలకులు, అమిత తేజోశాలురు, గొప్ప ఐశ్వర్యవంతులు, బ్రహ్మజ్ఞానులు, సమస్త లోకపాలుర చేత పూజింపబడువారు, యోగీశ్వరులు ఎందరో ఈ సభలో ఉన్నారు. వీరందరినీ లెక్కించక బుద్ధిహీనుడైన ఒక గొల్లపిల్లవాడిని పూజించటానికి ఎలా సమ్మతించారు. యజ్ఞం కోసం ఉద్దేశించిన పురోడాశం నక్కకు ఎలా అర్హమవుతుంది? అంతేకాకుండా ఈ కృష్ణుడికి గురువులు దేవుడు లేరు, కులం గోత్రం లేవు, తల్లితండ్రులు ఎవరో తెలియదు, నీటి మీద శయనిస్తాడు, ఆది మధ్యాంతాలు కానరావు, నటుడిలా అనేక రూపాలు ధరిస్తూ రకరకాలరీతులో ప్రవర్తిస్తుంటాడు, వర్తించే వావివరుసులు లేవు, ఏ బాంధవ్యబంధాలు లేవు. ఇతడు మా కారణంగానే మాననీయుడయ్యాడు కానీ, యయాతిశాపం వలన ఈ యదువంశం ప్రసిద్ధి అణగారిపోయింది. వీరి వంశం బ్రహ్మతేజాన్నికోల్పోయింది. ఇలాంటి ఈ గోపాలకుడు బ్రహ్మర్షుల పూజకు ఎలా అర్హుడవుతాడు? అంటూ అమంగళకరమైన మాటలతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించాడు. ఇలా శిశుపాలుడు నిందిస్తూ ఉంటే, నక్కకూతలను లెక్కపెట్టని సింహంలాగా శ్రీకృష్ణుడు లక్ష్యపెట్టలేదు కానీ, సభలో ఉన్న ఋషులు, రాజులు, మాత్రం శిశుపాలుడు పలికిన దుర్భాషలకు చాలా బాధపడ్డారు. కృష్ణుడిని నిందిస్తున్న శిశుపాలుడి దురాలాపాలను వినలేక మునులు రాజులు చెవులు మూసుకుని ఆశ్చర్యపడుతూ “ఓ కృష్ణా! వీడిని ఎలా కడతేరుస్తావో ఏమిటో?” అంటూ శిశుపాలుడిని నిందిస్తూ సభ నుంచి నిష్క్రమించారు. పాండవులకు శిశుపాలుడి మీద ఎంతో కోపం వచ్చింది. ఆ సమయంలో కేకయ రాజులు, సృంజయ రాజులు, పాండవులు ఆయుధాలు ధరించి శిశుపాలుడిని అదలించి నిలబడ్డారు. వాడు కూడ భుజబలగర్వంతో పాండ వాదులను లక్ష్యపెట్టక, కత్తీ డాలూ పట్టుకుని కృష్ణుడిని అతడిని అనుసరించే వారిని కోపంగా నిందించసాగాడు. అప్పుడు ముకుందుడు ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా పోరుకు సిద్ధంగా ఉన్న శిశుపాలుడిని తీవ్రంగా చూస్తూ, బహు వాడి కలదైన తన సుదర్శన చక్రంతో వాడి తల తరిగాడు. ఆ భయంకర కలకలాన్ని వినిన చూసిన, శిశుపాలుడి సైన్యము, అతడి పక్షపు రాజులు తత్తరపాటుతో పారిపోయారు.  ఆ సమయంలో శిశుపాలుని దేహంనుంచి దేదీప్యమానమైన తేజస్సు వెలువడి ఆ పద్మనాభుడు కృష్ణుడు శరీరంలో ప్రవేశించింది, మునీశ్వరులు రాజులు అది చూసి ఆశ్చర్యపోయారు.” మధుసూదనుడైన శ్రీహరి మీది మాత్సర్యంతో మదోన్మత్తుడై మూడు జన్మలనుండి విడువకుండా నిందించడం పేర, ఎల్లప్పుడు ఆ విష్ణుమూర్తి దివ్యమైన రూప గుణాలను ధ్యానిస్తూ ఉండడం వలన, పాపాలు సమస్తం నుండి విముక్తుడై ఈ శిశుపాలుడు బ్రహ్మరుద్రాదులకు సైతం అందరాని పదవిని అందుకున్నాడు. ధర్మరాజు తను చేసిన రాజసూయయాగాన్ని భక్తితో చూడడానికి వచ్చిన దేవతలు, మునులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు అందరిని ధర్మజుడు సముచిత రీతిలో సత్కరించాడు. వారందరు సంతృప్తి చెంది సంతోషంతో సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతూ యజ్ఞానికి విచ్చేసిన వారంతా శ్రీకృష్ణభక్తుడు పాండురాజ సుతుడు అయిన ధర్మరాజు కావించిన రాజసూయ యాగం వైభవాన్ని పొగుడుతూ తమ తమ స్థలాలకు వెళ్ళారు. ధర్మజుడు శ్రీకృష్ణుడిని వదలలేక ఇంకా కొన్ని రోజులు ఉండమని ప్రార్థించాడు. ఇలా ధర్మరాజు చేసిన విన్నపం శ్రీకృష్ణుడు మన్నించాడు. యాదవులను అందరినీ కుశస్థలికి పంపించాడు. తాను మాత్రం కొంత పరివారంతో ధర్మరాజు తృప్తిచెందే దాక ఇంద్రప్రస్థనగరంలోనే సంతోషంగా ఉన్నాడు. రాజసూయం చేయాలనే బహు దుష్కరమైన సముద్రమంతటి తన కోరికను ధర్మరాజు కృష్ణుడనే ఓడ ద్వారా దాటి, మానసికవ్యధ నుండి దూరమై గొప్పఐశ్వర్యంతో సంతోషంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడి భక్తులకు సాధ్యం కానిది ఏముంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...