పౌంద్రిక వాసుదేవ వధ

 


భూలోకంలో వాసుదేవుడు అనే పేరు నాకు ఒక్కడికే చెల్లుతుంది. ఇతరులకు ఏమాత్రం చెల్లదు. కృష్ణుడు పొగరెక్కి వాసుదేవుడనని అనుకుంటున్నాడుట. పోయి వద్దని చెప్పు” అని బలగర్వంతో మదోన్మత్తుడై,   శ్రీకృష్ణుడి దగ్గరకు పౌండ్రకుడు ఆ దూతను పంపించాడు. వాడు వెళ్ళి శ్రీకృష్ణుడు సభతీర్చి ఉండగా సంకోచం లేకుండా ఇలా అన్నాడు “ఓ శ్రీకృష్ణా! మా రాజు చెప్పిన మాటలు విను. ‘భూమిని రక్షించడానికి వాసుదేవుడనే పేరు నాకుండగా, నీవు సిగ్గు విడిచి ఆ పేరు పెట్టుకున్నావు. నా పేరూ, నా చిహ్నాలూ ధరించి సంచరిస్తున్నావు. ఇది నీ పంతమా? ఐనా గోవులకాచుకునే గోపాలుడికి పంతమేమిటి? నీ శక్తి ఎదుటివారిశక్తి ఇక నుంచి అయినా తెలుసుకుని, నా చిహ్నాలు అన్నింటినీ వదలిపెట్టి నాకు సేవకుడవై బ్రతుకు. కాదు పంతానికి పోతాను అంటావా. యుద్ధానికి సిద్ధపడు.” ఇలా పలికిన దూత దుర్భాషలను సభ్యులంతా విని ఒకరి ముఖం మరొకరు చూచుకుంటూ ఆశ్చర్యపోయారు. “ఈవేళ ఎంత విచిత్రపు మాటలు విన్నాము.” అని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రౌండ్రకుడి దూతతో ఇలా అన్నాడు.“ఓరీ! సరిగా విను. మీ రాజు ఏ చిహ్నాలను ధరించాను అని నన్ను గురించి చెప్పాడో; అవే చిహ్నాలను రేపు బయలుదేరి వచ్చి తొందరలోనే ఘోరయుద్ధంలో అతని మీద ప్రయోగిస్తాను. యుద్ధంలో శక్తి కోల్పోయి మరణిస్తావు అని మేము చెప్పినట్లుగా అతనికి చెప్పు.” అని వ ఉద్రేకంగా పలికిన శ్రీకృష్ణుడి పలుకులకు వాడు ఉలికిపడి గుండెజారిపోయి, తన ప్రభువు దగ్గరకు వెళ్ళి, జరిగిన దంతా అతని మనస్సుకు ఆందోళన కలిగేలా విన్నవించాడు. ఆ తరువాత, దారుకుడు అనేక రకాల ఆయుధాలు కలది; బంగారుజెండాతో విలసిల్లుతున్నది; వేగవంతాలైన గుఱ్ఱాలు కట్టినది అయిన రథం సిద్ధంచేసి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణుడు పౌండ్రకుడి మీదకు దండయాత్రకు ఉత్సహించి దారుకుడు తెచ్చిన ఆ రథాన్ని అధిరోహించి కాశీనగరానికి వెళ్ళాడు. పౌండ్రకుడు కూడా మిక్కిలి రణోత్సాహంతో రెండు అక్షౌహిణుల సైన్యంతో పట్టణం బయటకు వచ్చాడు. అతని స్నేహితుడైన కాశీరాజు కూడ మూడు అక్షౌహిణుల సైన్యంతో పౌండ్రకునికి సహాయంగా వచ్చాడు. ఈ విధంగా మిత్రసహితుడై యుద్ధరంగానికి వస్తున్న పౌండ్రకుడిని శ్రీకృష్ణుడు చూసాడు. పౌండ్రకుడు శంఖం, చక్రం, గద, కత్తి మొదలైన ఆయుధాలను ధరించాడు. కృత్రిమమైన కౌస్తుభమణి వక్షాన తగిలించుకున్నాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు ధరించాడు. కంఠంలో వనమాల వేసుకున్నాడు. గరుడకేతనాన్ని చేకూర్చుకున్నాడు. పీతాంబరాన్ని కట్టాడు. వడిగల గుఱ్ఱాలతో గూడిన బంగారురథాన్ని అధిరోహించాడు. కాంతివంతమైన కిరీటాన్ని తలపై అలంకరించుకుని యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఇలా తన వేషాన్ని ధరించిన పౌండ్రకుని చూసి రంగస్థల నటునిగా భావించి శ్రీకృష్ణుడు పకపకా నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు. పరిఘ, విల్లు అమ్ములు, పట్టిసం, ముసలం, సమ్మెట, ఈటె, చక్రం, గద, చిల్లకోల, బాకు, శక్తి ఆయుధము, చురకత్తి, గొడ్డలి, శూలం మొదలైన ఆయుధాలను చేపట్టి శ్రీకృష్ణుడి మీద వేగంగా ప్రయోగించాడు.  దానితో, దానవాంతకుడు కృష్ణుడు భయంకర ప్రళయాగ్ని వలె విజృంభించి విరోధి ప్రయోగించిన ఆయుధాలు అన్నింటినీ తన బాణ సమూహంతో త్రుంచివేశాడు. శత్రుసైన్యాలకు సంచలనం కల్గించే తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అమితమైన ఆగ్రహంతో సరోజనాభుడు శ్రీకృష్ణుడు, మారి మహామారి వ్యాపించి సంహరించినంత భీకరంగా, వారియొక్క సైన్యాలను నాశనం చేసాడు; రథాలు విరిగిపోయాయి; అశ్వాలు కూలాయి; ఏనుగులు వ్రాలాయి; కాల్బలం గడ్డి కరచింది; మరణించకుండా మిగిలిన సైన్యం పరాక్రమం చెడి పారిపోయాయి.ఆ సమయంలో తనపై కాలుద్రువ్వుతున్న పౌండ్రకుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ రాజాధమా! పౌండ్రకా! ఈరోజు యుద్ధంలో పౌరుషం అంతా పటాపంచలు చేస్తాను. ఎద్దు క్రొవ్వెక్కి ఆబోతుపై రంకెవేసినట్లు, నా దగ్గరకు దూతను పంపి నన్ను ఆక్షేపించావు. నన్ను వదలివేయమనిన ఆ చక్రాది చిహ్నాలనే నీ మీద నిప్పులు చెలరేగేలా యుద్ధంలో ప్రయోగిస్తాను. అలా చేయలేకపోతే నిన్ను శరణువేడతానులే. నిజంగా నీవు కనుక బలపరాక్రమాలు గల వీరాధివీరుడవు అయితే యుద్ధరంగంలో నిలకడగా ఉండు.” అంటూనే శ్రీకృష్ణుడు వాడి బాణాలను సంధించి, అప్పుడు పట్టుదలతో బాణాలు వేసి, వాడి రథాన్ని కూల్చివేసి, వెంటవెంటనే సారథి తల తెగనరికి, గుఱ్ఱాలను సంహరించాడు. ఉద్దండ ప్రతాపంతో ప్రళయకాల సూర్యుడితో సమానమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించి, పౌండ్రకుడి శిరస్సును ఖండించాడు. వజ్రాయుధము దెబ్బకి కూలిన పర్వతంలా పౌండ్రకుడు నేలకూలాడు. అటుపిమ్మట, కాశీరాజు శిరస్సును కూడా శ్రీకృష్ణుడు ఖండించి, ఆ శిరస్సును బంతిలాగ వరుస బాణాలతో పైపైకి ఎగురకొట్టి అతని పట్టణంలో పడేలా కొట్టాడు. ఈ విధంగా మురాంతకుడు శత్రువులను జయించి దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య, గరుడ, ఉరగ గణాలు వారందరూ స్తుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మిక్కిలి వైభవంతో తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు.పౌంద్రిక వాసుదేవుడు బ్రతికినంత శ్రీకృష్ణుడు రూపం ధరించి ద్వేషంతోనే నిరంతరం శ్రీకృష్ణుడిని స్మరించటం వలన మోక్షం పొందాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...