ధర్మరాజు రాజసూయ యాగం


శ్రీకృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలసి ఇంద్రప్రస్థనగరానికి బయలుదేరాడు. ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి; ఇందుమతీనదిని దర్శించి; దృషద్వతీ, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి; ఇంద్రప్రస్థ నగరం చేరి, ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేసాడు. శ్రీకృష్ణుడు వచ్చాడు అని తెలుసుకున్న ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. శ్రీకృష్ణుడిని దర్శించుకొని సకల మర్యాదలతో ఇంధ్రప్రస్థానికి తీసుకువచ్చారు. శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజమహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేసాడు. ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుచీరలూ, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికీ, ఆయన అంతఃపుర కాంతలకూ, పరివారానికీ అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదులు ఏర్పాటు చేయించి, సకల నవ్య సౌకర్యాలూ సమకూర్చాడు. శ్రీకృష్ణుడు కూడ ధర్మరాజు ఏర్పాటు చేసిన సముచిత మర్యాదలకు సంతోషించి, అర్జునుడితో కలసి సరసవినోదవిహార కార్యక్రమాలతో కొన్నినెలలు సుఖంగా అక్కడ ఉన్నాడు. ఒకరోజు తన సభాభవనంలో ఉండగా నిండుకొలువులో సింహాసనంపై ధర్మరాజు కూర్చుని శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణా! రాజసూయయాగం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. దానిని నిర్వహించడానికి నీవు తప్ప నాకు వేరే ఆత్మబంధువులు ఎవరున్నారు? అని అన్నారు. అందుకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మరాజా! రాజనీతి విశారదుడవు నీ ఆలోచన సమంజసంగా ఉంది. ఈ రాజసూయ ప్రక్రియ మునులకు, దేవతలకు, పితృదేవతలకు అభీష్టమైనది. అది సమస్త శత్రు క్షయాన్ని, సకల బంధువు ప్రియాన్ని, సమధికమైన పుణ్యాన్ని, శాశ్వతమైన కీర్తిని, విజయాన్ని, సిద్ధింప చేస్తుంది. కాబట్టి శీఘ్రమే ఈ యాగాన్ని ప్రారంభించు. నీ తమ్ముళ్ళు దివ్యమైన ఎదురులేని అస్త్రవిద్యా విశారదులు; యుద్ధభూమిలో ఎదిరించిన శత్రురాజులను సంహరించడంలో చక్కని సామర్థ్యం కలవారు. శత్రురాజులను జయించు; శాశ్వతమైన యశస్సుతో ప్రకాశించు; సమస్త భూమండలంలో నీ శాసనం చెల్లేలాగ స్థిరంగా స్థాపించు. నీవు ఏ కార్యం చెప్తే దానిని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నిన్ను వేలెత్తి చూపడానికి ఈ లోకంలో రాజులు ఎవ్వరికీ సాధ్యం కాదు. నీకు సాధ్యం కాని కార్యం లేదు. బహు గొప్పదైన ఈ రాజసూయ యాగానికి అవసరమైన సామగ్రిని సమకూర్చు. శత్రువులు అందరినీ జయించడానికి నీ సహోదరులను పంపించు.” ఈవిధంగా పలికిన శ్రీకృష్ణుడి మాటలు వినిన ధర్మజుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. మహాపరాక్రమవంతులైన తన సహోదరులతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. “సహదేవా! నీవు సృంజయ రాజులూ, చతురంగబలాలూ నిన్ను కొలుస్తూ వస్తారు. వారిని తీసుకు వెళ్ళి దక్షిణ దిక్కును జయించి రా” అని సహదేవుడిని ఆజ్ఞాపించాడు. నకులా!నీవు పడమటిదిక్కును జయించి రా అని నకులుడిని పంపించాడు. అర్జునుడిని ఉత్తర దిక్కునా ఉన్న రాజులను జయించి రమ్మని అర్జునుడిని పంపారు. తూర్పుదిక్కును జయించడానికి గొప్ప శౌర్యవంతు లైన మత్స్య, కేకయ, మద్ర రాజులతో కలిసి శత్రు రాజులను జయించటానికి భీముడిని వెళ్ళమని ధర్మరాజు పంపించాడు. ఇలా ధర్మరాజు పంపించగా వెళ్ళిన భీమార్జున నకుల సహదేవులు మహాపరాక్రమవంతు లయిన ఆయా దిక్కులలోని రాజులను ఓడించి; వారిచేత కప్పాలు కట్టించుకుని; బంగారం, మణులు, గుఱ్ఱాలు మొదలైన వస్తు సమూహాన్ని తీసుకుని వచ్చి ధర్మరాజునకు నమస్కారం చేసి అర్పించారు. తాము వెళ్ళివచ్చిన విధానములూ రణరంగంలో రాజులను జయించిన వివరాలూ అన్నగారికి వివరించారు. అందులో జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదని అర్జునుడు ధర్మరాజుకు చెప్పారు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...