శ్రీకృష్ణుడు లేనిసమయంలో ద్వారకను ముటడించిన్నా సాల్వుడు


ఓ రాజా! రుక్మిణీ స్వయంవర సమయంలో శిశుపాలుడికి సహాయంగా సైన్యంతో సహా వచ్చి, కృష్ణుడిని ఎదిరించి, అతని చేత చావుదెబ్బలు తిని పరాజితులైన రాజులలో సాల్వుడు అనే రాజు ఒకడు. అతడు విపరీతమైన కోపంతో, మొండిపట్టుదలతో “యాదవులను అందరిని నాశనం చేస్తాను” అని జరాసంధాది రాజుల ఎదురుగా ప్రతిజ్ఞ చేసాడు. ఆతరువాత అతడు అత్యంత నిష్ఠతో ఒక ప్రశాంత ప్రదేశంలో ఈశ్వరుడిని గురించి తపస్సు చేసాడు. సాల్వుడు ప్రతిదినం పిడికెడు దుమ్ము మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ పట్టుదలగా పరమేశ్వరుని గురించి భీకర తపస్సు చేసాడు. చెదరని భక్తితో శంకరుని పాదాలపై మనస్సు నిలిపి ఒక సంవత్సరం అలా భీకర తపస్సు చేయగా. అతని భక్తికి పరమేశ్వరుడు సంతోషించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై “నీవు ఏ వరం కోరినా ఇస్తాను. కోరుకొ” అని సాల్వుడిని అనుగ్రహించాడు. సాల్వుడు పరమ ప్రీతితో శంకరుడికి నమస్కారంచేసి ఇలా అన్నాడు “ఓ శివా! ఆశ్రితుల ఎడ కృప చూపు వాడా! నన్నురక్షించేటట్లయితే నా కోరిక ఏమిటో మనవి చేస్తాను. చిత్తగించు. ఓ ఈశ్వరా! వరదా! ప్రభూ! గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస, దేవతాదులకు సాధ్యం కానట్టిది, నా కోరిక ప్రకారం అవసరమైనప్పుడు ఆకాశమార్గంలో సంచరించగలది అయిన అద్భుతమైన విమానాన్ని నాకు ప్రసాదించు.” అలా సాల్వుడు కోరిన విధమైన విమానాన్ని ఈశ్వరుడు “అతడి కోరికకు తగిన పురము నిర్మించి యి” మ్మని మయుడిని ఆదేశించాడు. అతడు చిత్తమని కామగమనమూ మిక్కిలి వెడల్పూ పొడవూ కలిగి లోహమయమైన ఒక విమానాన్ని నిర్మించి దానికి “సౌభకము” అని పేరుపెట్టి సాల్వుడికి ఇచ్చాడు. వాడు పరమానందంతో దానిని ఎక్కి యాదవుల మీద తనకు ఉన్న పూర్వ శత్రుత్వం గుర్తుచేసుకుని గర్వంతో కన్నుమిన్ను గానక తన సేనలతో వెళ్ళి ద్వారకాపట్టణాన్ని ముట్టడించాడు. ద్వారకానగరంలోని సెలయేర్లను ఉపవనాలను ధ్వంసం చేయించాడు; చెఱువులు బావులు పూడిపించాడు; కోటలను ఛిన్నాభిన్నము చేయించాడు; అగడ్తలను పాడుచేసాడు; కోటగోడలను పడగొట్టించాడు; ప్రాకారాలు బురుజులు కూలదోయించాడు; యంత్రాలను ధ్వజపతాకాలనూ నరకించాడు; గోపురాలను మిద్దెలను మేడలను చంద్రశాలలను కాల్చి బూడిద చేసాడు; పట్టణంలోని బంగారాన్ని రత్నాలు మొదలైన వస్తువులను కొల్లగొట్టాడు; ప్రజలను చెఱపట్టాడు; అధికారులను అవమానించాడు; ఇలాగ సాల్వుడు ద్వారకలోని ప్రజలను పెక్కు బాధలకు గురిచేసాడు. అంతటితో వదలిపెట్టకుండ విమానం ఎక్కి సాల్వుడు ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుండి చెట్లకొమ్మలు గులకరాళ్ళు బాణాలు కురిపిస్తూ ద్వారకావాసులను బాధించాడు. దుమ్ము ధూళితో సుడిగాలులు ప్రయోగించి కల్లోలపరచాడు. అది చూసి మహాప్రభావశాలి రథికశ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి, మీనకేతనం ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథం ఎక్కి, మహోత్సాహంతో అస్త్రశస్త్రాలను ధరించి, సైన్య సమేతంగా యుద్ధభూమికి బయలుదేరాడు. మహా భుజబల పరాక్రమవంతులైన గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుని నందననుడు అనిరుద్ధుడు, శఫల్కుని పుత్రుడు అక్రూరుడు మున్నగు యాదవవీరులందరూ కృతవర్మ నాయకత్వంతో యుద్ధభూమికి బయలుదేరారు. యాదవవీరులు చతురంగబలసమేతులై జగత్తు కంపిస్తుండగా, తాము ధరించిన రకరకాల ఆయుధాల కాంతులు సూర్యబింబాన్ని కప్పివేస్తుండగా అరివీర భీకరంగా రణరంగానికి బయలుదేరారు. సమరంలో విస్తారమైన అల్లెత్రాళ్ళ టంకారాలు, మదగజాల ఘీంకారాలు, భటుల హూంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు, శత్రుసంక్షోభంగా భూమ్యాకాశాలు నిండాయి. గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశ విహారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించాయి. ఇరు పక్షాల సైన్యాలు పూని ఒకరి నొకరు ఎదిరించి బాణ వర్షాలు కురిపించి మర్మస్థానాలను చీల్చేస్తు, క్రోధంతో కన్నులనుండి నిప్పురవ్వలు రాలగా పెద్ద పెద్ద గదలతో తలలపై బాదుకుంటూ, భయంకరంగా పోరాడారు. అలా భీకరంగా పోరుసాగుతున్న సమయంలో అదంతా వీక్షిస్తున్న ప్రద్యుమ్నుడు సాల్వుడు కలుషాత్ముడై పన్నిన అనంత మాయాజాలాలను వీక్షించాడు. వీరావేశంతో విజృంభించి, సూర్యుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు చేయునట్లు, ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతో ఆ మాయాజాలాన్ని ఛేదించాడు. గగనచరులు అతని పరాక్రమం చూసి పొగిడారు. గొప్ప అతిరథుడి వలె ప్రద్యుమ్నుడు ఇరవైఐదు వాడి బాణాలతో సాల్వుడి సైన్యాధిపతిని నొప్పించాడు. పిడుగుల్లాంటి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని మూపు పగలగొట్టాడు. లయకాలపు భైరవుడి లాగ విజృంభించాడు. ప్రద్యుమ్నుడు పదేసి బాణాలు చొప్పున వేసి, సాల్వుడి మిత్రులైన రాజశ్రేష్ఠులను నొప్పించాడు. మూడేసి బాణాలు వేసి రథ, గజ, అశ్వాలను పడగొట్టాడు ఒక్కొక్క బాణం ప్రయోగించి సైనికులను చిందరవందర చేసాడు. ఇలా ప్రద్యుమ్నుడు ఎదురులేని విధంగా పరాక్రమించాడు. అలా మేరుపర్వతం అంత ధైర్యంతో ప్రద్యుమ్నుడు నిర్భయంగా అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించగా, తిలకించిన ఉభయ సైన్యాలు పొగిడారు. అలా సాల్వుడితో యుద్ధం జరుగుతున్న సమయంలో సాల్వుడు సాంబుడి మీద అనేక బాణాలు ప్రయోగించి నొప్పించాడు. అంతట ఆ జాంబవతీ తనయుడు సాంబుడు తన ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుడి వక్షాన్ని పదిహేను బాణాలతో కొట్టాడు. వాడి బాణాలు ఇరవై వేసి వాడి సౌభక విమానాన్ని అల్లల్లాడేలా చేసాడు. గొప్ప రథికుడైన గదుడు రాహుముఖం లాంటి బాణాలను ప్రయోగించి శత్రువుల శిరస్సులు ఖండించి గుదులు గుదులుగా నేలకూలుస్తు మొక్కవోని పరాక్రమంతో విజృంభించాడు. ఆకాశంలో అతని పరాక్రమం చూసి దేవతలు ప్రస్తుతించారు. సాత్యకి మహారోషంతో సాల్వుడి చతురంగబలాలను, సౌభక విమానము అనే చీకటిని సూర్యకిరణాల వంటి వాడి యైన బాణాలను ప్రయోగించి పటాపంచలు కావించాడు. సైనికులందరు అతని పరాక్రమాన్ని బహువిధాల ప్రశంసించారు. భానువిందుడు విజృంభించి, శత్రుసైన్యం అనే అడవిని తీవ్రమైన దావానలం వంటి తన బాణాలు అసంఖ్యాకంగా వేసి భస్మీపటలం చేసాడు. అతని ధనుర్విద్యా కౌశల్యాన్ని దేవతా సమూహం ప్రస్తుతించింది. చారుదేష్ణుడు ఆగ్రహంతో విజృంభించి వాడి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని దండనాథులను సంహరించి సింహనాదం చేసాడు. యోధుడైన శుకుడు యుద్ధవిజయకాంక్షతో చెలరేగి తన భుజబలం విశదం అయ్యేలా శరసమూహంతో శత్రు సేనావ్యూహాన్ని నాశనం చేసాడు. సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు. అక్రూరుడూ అతని తమ్ముళ్ళూ తిరుగులేని పరాక్రమంతో మెరసి ఈటె, చక్రము మున్నగు రక రకాల సాధనాల ప్రయోగంతో శత్రువులను వధించారు. రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు. అప్పుడు, సాల్వుడికి బాగా కోపం వచ్చింది. అతడి సౌభకవిమానం తన మాయాప్రభావంతో విజృంభించింది. ఆ సౌభకవిమానం తన మాయా ప్రభావంతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒకమారు సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొరవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది. ఇలా సౌభకవిమానం విజృంభించేసరికి అంతకు ముందు యాదవసైన్యంవల్ల భీతిచెందిన తన సైన్యాల్ని సాల్వుడు మళ్ళీ పురిగొల్పి యుద్ధోన్ముఖులను చేసాడు. సాల్వుడు యాదవసైన్యంమీద అగ్నిజ్వాల ల్లాంటి బాణాలను పింజ పింజతాకేలా వేసాడు. అయినా ఆ సైన్యం చెదరక బెదరక వెనుకంజ వేయక ధైర్యంతో నిలచి యుద్ధం చేసింది. ఆ సమయంలో రెండు పక్షాల యోధులూ నదురూ బెదురూ లేకుండా, అలసిపోకుండా గట్టిగా పౌరుషంతో పోరాడారు. అప్పుడు ప్రసిద్ధులైన యోధుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగసాగింది. మునుపు ప్రద్యుమ్నుడి బాణాల వలన మిక్కిలి నొచ్చిన సాల్వుడి మంత్రి ద్యుముడు అనేవాడు గదను ధరించి ప్రద్యుమ్నుడిని ఎదుర్కున్నాడు. నేర్పూ బలపరాక్రమాలూ ప్రదర్శిస్తూ ద్యుముడు గదతో కృష్ణకుమారుడు ప్రద్యుమ్నుడి వక్షం పగిలేలా మోదాడు. ఆ దెబ్బకి అతడు మేను గగుర్పడంతో చేతిలోని అస్త్రశస్త్రాలను రథంమీదనే వదిలి కనులు మూతలు పడి మూర్ఛపోయాడు. సారథి దారకుని కుమారుడు; యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు; నీతిశాస్త్ర పారంగతుడు; కనుక, రథాన్ని మళ్ళించి యుద్ధభూమినుండి ప్రక్కకు తోలుకుని పోయాడు. కొంతసేపటికి ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. సారథిని, తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇలా మందలించాడు. “కృష్ణుడూ బలరాముడూ ఎగతాళి చేసేలా, శత్రువులు నవ్వేలా రణక్షేత్రం నుండి రథాన్ని తప్పించి, అపకీర్తి తెచ్చావు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ మాదిరి యుద్ధరంగం నుంచి తొలగిపోరు కదా.” ఇలా అంటున్న ప్రద్యుమ్నుడితో సారథి యుద్ధధర్మం ప్రకారం శత్రువుల వలన రథికుడు నొచ్చినపుడు సారథి, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ పరస్పరం రక్షించుకోవాలి, కాబట్టి. నేను ఇలా చేసాను. నీవు బాధపడక విరోధులను గెలవడానికి ప్రయత్నించు.” అని అన్నాడు. మహాశూరుడు, అపార బలసంపన్నుడు అయిన ప్రద్యుమ్నుడు సారథి మాటలకు సంతోషించాడు. ధనుష్టంకారంతో శత్రువులను భయభ్రాంతులను చేస్తూ గొప్ప నేర్పుతో ద్యుముడి మీదకి తిరిగి రథాన్ని తోలించాడు. మిక్కిలి ఆగ్రహంతో ప్రద్యుమ్నుడు అవక్రపరాక్రమం ప్రదర్శిస్తూ ఎనిమిది బాణాలను వేసి శత్రువు శరీరాన్ని పగులకొట్టాడు. నాలుగు బాణాలు వేసి అతని గుఱ్ఱాలను కూల్చాడు. రెండు బాణాలతో వాడి పతాకాన్నీ ధనుస్సునూ నుగ్గునుగ్గుచేసాడు. ఒక బాణంతో భయంకరంగా అతని సారథిని సంహరించాడు. పిమ్మట విక్రమించి ప్రద్యుమ్నుడు ఒక అమ్ముతో ద్యుముని కంఠాన్ని భీకరంగా నరికాడు. అది చూసిన సాంబుడు మున్నగు యదు యోధులు ప్రద్యుమ్నుడిని ప్రస్తుతించారు. పదునైన బంగారు పింజలు గల బాణాలతో తాటిపండ్లను నేల రాల్చినట్లు సాల్వుని సైనికుల తలలు ఉత్తరించారు. ఈ విధంగా యాదవ బలాలూ, సాల్వ సైన్యాలూ ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో ఇరవైఏడు రోజులు పాటు తూర్పు పడమర సముద్రాలు తలపడి పోరుతున్నాయా అన్నట్లు భీకరంగా యుద్ధం చేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థం నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు వస్తూ మార్గమధ్యంలో కనపడ్డ చెడ్డ శకునాలను కనుగొని సారథి యైన దారుకుడితో ఇలా అన్నాడు. చూడు దారుకా! అపశకునాలు ఆకాశంలోను, భూమి మీద అతిభీకరంగా కనబడుతున్నాయి. నేను ఇంద్రప్రస్థంలో ఉన్న విషయం తెలుసుకొని శిశుపాలుడి మిత్రులైన రాజులు మన పట్టణం మీద యుద్ధానికి తలపడినట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనియ్యి అని అన్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...