కాశీనగరాన్ని ధ్వంసం చేసిన శ్రీకృష్ణుడి చక్రాయుధం



ఇక అక్కడ కాశీపట్టణంలో ఆ రాజమందిరంలో, కుండల సహితమైన శిరస్సు పడగానే పురజనులు అందరూ అది తమ రాజు శిరస్సుగా గుర్తించారు. ఆ రాజు భార్యలు, పుత్రులు, మిత్రులు, బంధువులు హాహాకారాలు చేస్తూ దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు తండ్రికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. తన తండ్రిని యుద్ధంలో సంహరించిన శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఉపాయం ఆలోచించాడు. చతురుడైన పురోహితుడిని పిలిపించి నువ్వు నీవూ ఋత్విజులూ బ్రాహ్మణశ్రేష్ఠులూ కలిసి ప్రీతితో అభిచారహోమం చేయి, భూతములతో కూడి, అగ్నిదేవుడు మనల్ని అనిగ్రహిస్తాడు అని అన్నాడు. కొంత కాలం తరువాత సుదక్షిణుడు గొప్పనియమాలతో అభిచార హోమం చేసాడు. అగ్నిదేవుడు కుడి వైపుగా తిరుగుతూ జ్వలించే జ్వాలలతో వెలిగాడు. ఆ అభిచారహోమ గుండంలోని అగ్నిజ్వాలల నుండి ఎఱ్ఱని జుట్టూ; పిడుగుల వంటి కోరలూ; నిప్పులు గ్రక్కే చూపులూ; ముడిపడిన కనుబొమలూ; జేవురించిన ముఖము; కలిగిన “కృత్య” అతిభయంకర ఆకారంతో వెలువడింది. ఆ కృత్య మృత్యుదేవత కరవాలంలా కనిపిస్తున్న నాలుకతో పెదవి మూలలు తడవుకుంటూ, అగ్నిజ్వాలవంటి శూలాన్ని చేతబట్టి, లోకం దద్దరిల్లేలా బొబ్బలు పెడుతూ, నింగినిండా దుమ్ము వ్యాపించేలా తాటిచెట్ల వంటి పాదాలతో అడుగులు వేస్తూ, భూతాలు సేవిస్తుండగా, కళ్ళ నుంచి రాలే నిప్పులతో దిక్కులను కాల్చివేస్తూ, అతివేగంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి దిగంబరంగా వచ్చింది. ద్వారకానగరవాసులు అంతా కృత్యను చూచి దావానలాన్ని చూసి పారిపోయే అడవిజంతువుల లాగా పారిపోయి “కాపాడు కాపాడు” అని అరుస్తూ, సుధర్మా సభామండపంలో జూదమాడుతున్న దామోదరుడు, శ్రీకృష్ణుడిని చేరారు. “మన పట్టణాన్ని దహించడానికి ప్రళయకాలాగ్ని వచ్చింది. మమ్మల్ని రక్షించు” అని ప్రార్థించారు. వారికి “భయపడకండి” అని చెప్పి, పుండరీకముల వంటి కన్నులున్న వాడు, విశ్వము అంతటిలోనూ ఆత్మరూపంలో వ్యాపించి ఉండేవాడు, సర్వరక్షకుడు, అయిన శ్రీకృష్ణుడు జరిగిన సంగతంతా దివ్యదృష్టితో తెలిసికొని, కాశీ రాకుమారుడు పంపించిన కృత్యను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని విడిచి పెట్టారు. ఆ చక్రాయుధం కృత్యను సమీపించింది. తనను చూసి తడబడకుండా కంటగిస్తున్న కృత్యను గెంటివేసి, వెంటబడింది. అప్పుడు, కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురం వచ్చింది. తిరిగి వచ్చిన కృత్యను చూసి పౌరులంతా భయపడి భయపడుతుండగా, ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుని దహించి వేసింది. అప్పుడు, శ్రీకృష్ణుడి చక్రాయుధం ఆ వచ్చిన వేగంతో కృత్యను సంహారించింది. దానిని సంహారించే సమయంలో కాశీ నగర సౌధ, గోపుర, ప్రాకారాలతోపాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేలా శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి చేరి, తన నిజప్రభావంతో ప్రకాశిస్తూ ఉంది.

పౌండ్రిక వాసుదేవ వధ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...