పెరియవ తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు

ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామివారి భక్తుడొకరికి పెద్ద దుఃఖం కలిగింది. తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినబడుతూ ఉంటుంది. ఆ స్వరం ఏవేవో విషయాలన్నిటిని చెబుతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూ ఉండేది. ఎన్నో సార్లు ఆ బాధని భరించలేక నిద్రనుండి మేల్కొనేవాడు.



అది ఎవరి గొంతు? బహుశా ఆంజనేయ స్వామివారి గొంతు అనుకుని అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. చాలామంది తమ కష్టాలు తీర్చమని అతని ముందు వరుసలు కట్టడం మొదలుపెట్టారు. అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలుపెట్టారు. దాని కొరకు అతడు ఒక రోజు కేటాయించవలసి వచ్చింది. అతను కూడా ఎటువంటి ధనం ఆశించకుండా చెప్పేవాడు. కనుక అలా వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరగసాగింది.

అలా అడిగినవారికి అందరికి అతని చెవుల్లో వినబడే శబ్దాలను విని వాటిని చెప్పేవాడు. చివరగా అతను మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులాగా విలవిలలాడిపోయాడు.

“నన్ను కాపాడేవారెవరు?” అని భోరున విలపించాడు.

నా వద్దకు రా అన్నట్టుగా కనపడుతున్న మహాస్వామివారే తనను కాపాడగలరని తెలుసుకొని వారి పాదపద్మముల యందు శరణాగతిని వేడాడు. “నేనున్నాను. నావద్దకు రా” అని స్వామివారు భరోసా ఇచ్చినట్టు భావించాడు.

“పెరియవ తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు. నా చెవుల్లో ఎప్పుడూ ఏవో మాటలు వినబడుతున్నాయి. మొదట హనుమంతులవారే అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని అంచనాలు నిజం అయ్యాయి కూడా కాని మొత్తానికి నేను మనఃశాంతిని కోల్పోయాను. నాకు ఇక ఉత్తరభారతంలో ఉండడం ఇష్టం లేదు. నాకు ఎలాగైనా బదిలీ కావాలి. దయచేసి నాపైన మీ కరుణను ప్రసారించండి పెరియవ” అని వేడుకున్నాడు.

“ఇవన్ని నాకెందుకు చెబుతున్నావు? నీకు ఆంజనేయ స్వామి వారి ఆశిస్సులు ఉన్నాయి కదా? మరి ఆంజనేయ స్వామికే ఎందుకు చెప్పుకోకూడదు?” అని స్వామివారు నవ్వుతూ అన్నారు.

అతను చాలా సిగ్గుపడ్డాడు. “పెరియవ నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయ స్వామివారిది అని అనుకున్నాను. అది ఎ దయ్యమో నాకు తెలియదు. నన్ను నిద్రపోవడానికి కూడా వదలడం లేదు. అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను. నేను ఏమి మాట్లాడకపోయినా ఏవో పనికిమాలిన విషయాలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. పెరియవ రక్షించండి”

“ఎప్పుడూ రామ నామం జపిస్తూ ఉండు. కుంబకోణం దగ్గరలోని గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది. అక్కడకు వెళ్లి కొన్నిరోజులపాటు ఉండు” అని ఆదేశించి ప్రసాదం ఇచ్చి పంపించారు.

పదిరోజుల తరువాత ఆ భక్తుడు గోవిందపురం నుండి వచ్చాడు. అతని మొహం సంతోషంతో వెలిగిపోతోంది. పరమాచార్య స్వామికి సాష్టాంగం చేశాడు.

“ఏమిటి? ఆంజనేయస్వామి వారు రామ సేవకు వెళ్లిపోయారా?” అని కొంటెగా అడిగారు. గోవిందపురం వెళ్ళగానే తాని బాధ తీరిపోయింది. ఇక ఎప్పుడూ ఆ గొంతు అతనికి వినబడలేదు. భగవంతుని నామాన్ని నిరంతరమూ జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైన ఆలోచనలు, మాటలు ఇక వినబడవు. పొరపాటున విన్నా అవి మన మనస్సుకి చేరి మనః శాంతిని పోగొట్టవు.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్|

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...