తిరుప్పావై

పాశురము 21

    ఏత్తకలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప     

    మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్

    ఆత్తప్పడ్తెత్తాన్ మగనే! యఱివుఱాయ్;

    ఊత్తముడైయాయ్ పెరియాయ్! ఉలగినిల్

    తోత్తయాయ్ నిన్ఱశుడరే. తుయిలెళాయ్;

    మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్

    ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే

    పోత్తియామ్ వన్దోమ్ పుగళన్దు ఏలోరెమ్బావాయ్

అర్ధం :-

పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఒ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా! అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై 'నీవే తప్ప ఇతః పరంబెరుగ'మని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు.



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 20

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః|

కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కింపిత్ కరోతి సః||

అర్ధం :-

సమస్తకర్మలయందును, వాటిఫలితములయందును సర్వథా ఆసక్తిని వీడి,  సంసార ఆశ్రయరహితుడై, పరమత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు, కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని వాస్తవముగా వాటిని కర్త కాడు.

తిరుప్పావై

పాశురము 20

    ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు

    కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;

    శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు

    వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్;

    శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్

    నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్;

    ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై

    ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్

అర్ధం :-

ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగనే అటకుపోయి వారిని రక్షించు సమర్ధతగల ఓ స్వామీ! నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ బలశాలీ! శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!' అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి, జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్ధిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కల్గి అతిలోక సుందరముగ విరాజిల్లుచున్న ఓ నీళాదేవీ!మాయమ్మా! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! 'నేను లేచి మీకేమి చేయవలెనందువేమో!' వినుము - మన స్వామియైన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన (విసనకర్ర) నిమ్ము! ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము (అద్దము) నిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ యనుగ్రహమున్ననే కద మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?' అని ఆండాళ్ తల్లి నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో. 



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 19

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః|

జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః||

అర్ధం :-

ఎవని కర్మలన్నియును, శాస్త్రసమ్మతములై, కామసంకల్ప వర్జితములై జరుగునో,అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో, అట్టి మహపురుషుని జ్ఞానులు పండితుడని అందురు.

తిరుప్పావై

పాశురము 19

    కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్

    మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి,

    కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్

    వైత్తుక్కి డన్దమలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్

    మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై

    ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్

    ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్

    తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్

 అర్ధం :-

గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు. 



భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 18

కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః|

స బుద్ధిమాన్ మనుష్యేషు మనుష్యేషుస యుక్తః కృత్స్నకర్మకృత్||

అర్ధం :-

కర్మయందు 'అకర్మ'ను, అకర్మయందు 'కర్మ'ను దర్శించువాడుమానవులలో బుద్ధిశాలి.  అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. 

తిరుప్పావై

పాశురము 18

    ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్

    నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!

    కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్;

    వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి

    ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్;

    పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ,

    చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప

    వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్,

అర్ధం :- 

నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువకపోవుటచేత, మదజలము స్రవించుచున్న ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క కోడలా! ఓ నప్పిన్న పిరాట్టీ! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మా! కోళ్లు వచ్చి కూయుచున్నవి. జాజి పందిళ్లమీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా! నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునేయుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా!' అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు.



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...