శ్రీ లలిత సహస్రనామావైభవం 3

శ్రీమత్సింహాసనేశ్వరి

ఆకలివేసి అందరికీ తినడానికి దొరికి, తిన్నతరవాత అది జీర్ణమవడానికి, ఇంట్లోవాళ్ళు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకుండా సంతోషముగా ఉన్నారు అంటే సింహాసనములో ఉన్న పరమాత్మ ప్రసన్నుడై పరిపాలిస్తున్నాడు అని. అమ్మవారు ఒక్కతే నిజమైన సింహమును ఆసనముగా చేసుకుని సింహవాహన అయింది. ఆవిడ సింహమును అధిరోహించే యుద్ధములు చేసింది. అది మామూలు సింహము కాదు పెద్ద పెద్ద రాక్షసులను పంజాతో కొట్టి చంపేస్తుంది. యుద్ధభూమిలో సింహము పరిగెడుతుంటే రథముమీద వెళ్ళినట్టుగా ఉండదు. సింహపు వేగమునకు ఒరిగిపోకుండా, తాను కూడా కదులుతూ ఉగ్రముగా కూర్చుని రాక్షసులను చంపుతుంది.



సింహము మీద కూర్చుని మహిషాసుర సంహారము చేసినప్పుడు తల్లిని చూసి కీర్తించారు. ఉగ్రముగా ఉన్న అమ్మను ఉపాసన చెయ్యడము భయము కాదు. ఆవిడ శత్రువులను చంపుతుంది. ఆ తల్లిని ఉపాసన చెయ్యడము వల్ల భక్తులపట్ల ప్రసన్నురాలు అవుతుంది. సింహాసనములో ఉన్న తల్లికి కనుసన్నలలో లోకములో పరిపాలన అంతా జరుగుతున్నది. అమ్మవారి ఆజ్ఞకు వాయువు వీస్తున్నది, నీరు ప్రవహిస్తున్నది. ఆ తల్లికి ఆజ్ఞతో భూమి తిరుగుతున్నది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అగ్ని వేడిగా ఉన్నది.

సింహ శబ్దమును అటు ఇటు మారిస్తే హంసి అవుతుంది. హంస అనగా మెల్లగా నడవవలసినది. నడకకు ప్రసిద్ధి హంస. పరమహంసలు జగత్తును బ్రహ్మమును వేరు చేసి చూస్తారు. యోగనిష్ఠలోకి ప్రవేశించేవారు ఊపిరిని చాలా మెల్లగా పీల్చి మందముగా విడచిపెడుతూ ఉంటారు. ఊపిరి రూపములో ఒకావిడ లోపలికి, బయటికి హంసనడకతో మెల్లగా నడుస్తూ తిరుగుతున్నది. హృదయగుహలో శ్రీమత్సింహాసనేశ్వరి కూర్చుని ఉన్నంతసేపు హంస తిరుగుతూ ఉంటుంది. ఆవిడ లేచింది అంటే హంస తిరగడము ఆగిపోతుంది. ఆవిడ ఉండటమే శోభ. లలితా సహస్రము చదువుతూ శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరి అని ఊపిరి పీల్చేసరికి మనలోనే ఉన్న ఆవిడ పాదపద్మముల దగ్గరకే ఈ ఊపిరి వెళ్ళి వస్తున్నది అన్న భావన కలిగితే తరవాత నామము జ్ఞాపకమునకు రాదు. మనసు లోపలకు వెళ్ళి ఈ దర్శనము మొదలు పెట్టిందని గుర్తు. స్తోత్రం చదవడము ఆగిపోతుంది. అలా ఆగిపోతే నిజముగా లలితాసహస్రనామము చదివారని గుర్తు. అర్థమయి చదవడము అంటే దర్శనము పొందడము. ఏ నామము దగ్గర అనుభవించి రమించి ఆగిపోతే అక్కడ జన్మధన్యము అయిపోతుంది. పంచభూతములలోనుంచి వచ్చి మళ్ళీ పంచభూతములలోకి వెళ్ళిపోవడమునకు మధ్యలో ఉన్నసంధికాలమే జీవితము. వెళ్ళిపోయేట్టుగా చేసే శక్తిని ‘యత్ప్రయంతపి తనిష్వంతి’ సంహారప్రక్రియ అంటారు. పిపీలికాది పర్యంతము అనేక ప్రాణులు పుట్టి వెళ్ళిపోతుంటాయి. ఒక ప్రాణి పంచభూతములలో కలసిపోవడము కూడా కదలికయే. ఈశ్వరుని చేరిపోవడమే మనిషి జీవితములో ప్రధానలక్ష్యము. సింహ అన్న శబ్దమునకు హింసించునదని అర్థము. ప్రళయకాలములో తనను పొందకుండా ఉండిపోయిన జీవులను అమ్మవారు తానే పొందుతుంది అదే సింహాసనేశ్వరి. ఐదింటితో సింహాసనము అని తల్లిని చెపితే ఆ ఐదు శాక్తేయ ప్రణవములు అన్నారు. ‘శ్రీం హ్రీం క్లీం ఐం సౌః’ అన్న బీజాక్షరముల మీద కూర్చుంటుంది. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం నాలుగుదిక్కుల మధ్యలో పంచభూతములైన పృథ్వి జల తేజో వాయు ఆకాశములు ఐదూ సింహాసనముగా అమ్మవారు కూర్చున్న ప్రదేశమే అంతటా నిండిపోయిన ఆవిడ సింహాసనము. పంచముఖములు కలిగిన సద్యోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశానములనే అయిదు ముఖములతో అయిదు క్రియలు చేసే తత్త్వాన్ని అధిరోహించి పంచప్రేతాసీనయి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులనే నాలుగు కోళ్ళు గల తల్పము ఉన్న సింహాసనము మీద కూర్చుని ఉంటుంది. ఇన్ని విధములుగా ఆవిడ శ్రీమత్సింహాసనేశ్వరి.

భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 6

యం యం వాపి స్మరన్ త్యజత్యంతే కలేవరమ్ |

తం తమేవైతి కౌంతేయ సదాతద్భావభావితః ||

అర్థం :-

కౌంతేయా! మనుష్యుడు అవసానదశయందు ఏఏభావములను స్మరించుచు దేహత్యాగము చేయునో, అతడు మరుజన్మలో ఆయస్వరూపములనే పొందును. ఏలనన, సర్వదా అతడు దానినే స్మరించుచుండెను.



శ్రీ లలిత సహస్రనామావైభవం 2

 శ్రీమహారాజ్ఞి

‘శ్రీమహారాజ్ఞి’ – లలితా సహస్రనామస్తోత్రములో రెండవనామము. మహారాజు అనగా పరిపాలకుడు. అమ్మవారిని మహారాజ్ఞి అని స్త్రీ వాచకములో చెపుతున్నారు. ఆమె బ్రహ్మమై పరిపాలకురాలిగా నిర్వహణ చేస్తున్నది. ఉపనిషత్తునుండి వచ్చినమాట – ‘ఏనజాతాని జీవంతి’ – ఈ పుట్టినవి అన్నీ అమ్మవారి దయవలన బ్రతుకుతున్నాయి. పరిపాలన చేస్తున్న ఆమె మహారాజ్ఞి. మహారాజు అయినా మహారాజ్ఞి అయినా పాలితులు, పాలకులని వారికి ప్రధానమైన రెండులక్షణములు ఉంటాయి. పాలితులు అనగా పాలింపబడేవారు. పాలకులు అనగా పరిపాలించేవారు. మహారాజ్ఞి శబ్దము చేత ఒక విషయము తెలుస్తుంది. కేవలము సంక్షేమము కోసమే పరిపాలన చెయ్యరు. ప్రభుత్వముకూడా తప్పు చేసిన వాళ్ళను దండిస్తుంది - శిక్షిస్తుంది. ఆ శిక్షలు వెయ్యడములోకూడా దయతోనే ఉంటుంది. మహారాజ్ఞి అమ్మవారు ఎవరిని ఉద్ధరించాలో, ఎవరు భగవంతుని పట్ల భక్తిభావము కలిగి ఉన్నారో, ఎవరు భగవంతుడు చెప్పిన సూత్రముల ప్రకారము జీవితము గడుపుతున్నారో వారిని వృద్ధిలోకి తీసుకు వస్తుంది. మహారాజ్ఞిగా అమ్మవారు రక్షణ చేస్తుంది, శిక్షలు వేస్తుంది. చిన్నకోరికనుంచి మోక్షమనే స్థితి వరకు ఉన్న హద్దులు దాటించి ఏ హద్దులో ఉన్నవాళ్ళకి ఆ హద్దులలో ఆ స్థాయిని బట్టి కోరికలు తీర్చకలిగిన సమస్తశక్తులు కేంద్రీకృత మైన అమ్మ పరిపాలకురాలిగా కూర్చుని అనుగ్రహిస్తే శ్రీమహారాజ్ఞి. తనని తాను గుర్తెరిగి ఆత్మస్వరూపముగా నిలబడటానికి ఒక తెర అడ్డుపడుతున్నది. దానిని అమ్మవారే తీసి నిజస్వరూపముతో జ్ఞానిగా, ఆత్మరూపిగా, ఇక్కడే మోక్షము పొందడానికి కావలసిన స్థితిని, జ్ఞానమును, శక్తిని కృపచేస్తుంది. అమ్మవారి దర్శనమునకు ఎక్కడకు వెళ్ళాలి? ఆవిడ మన శరీరములోనే ఉన్నది. చెయ్యి కదిపితే అమ్మవారు కదుపుతున్నది. మాట్లాడితే అమ్మవారు మాట్లాడిస్తున్నది. ఉపాసన చేస్తున్నవారు ఇది గమనించి చెయ్యి కదిపితే వారు ముద్రలు పట్టినట్టే. తెలుసుకుని మాట్లాడితే అన్నీ అమ్మవారి స్తోత్రములే. శరీరమును ఆవహించి ముప్పదిమూడు కోట్లమంది దేవతలు ఉంటారు. వారికి శరీరమునుంచి హవిస్సు అందుతూ ఉంటుంది. శరీరము ఒక దేవాలయము దానిని పవిత్రముగా ఉంచడము నేర్పారు. అమ్మవారు శరీరములో అనేకమైన చోట్ల ఉంటుంది. బొడ్డులో చిటికిన వేలు పెట్టి పైకి బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ వంగిన కమలము ఉంటుంది. దాని మొగ్గ చివర అగ్నిహోత్రము ఉంటుంది. వడ్లగింజ పైన ఉన్నంత చిన్న మొనలో ఆ ప్రకాశము వెలుగుతూ ఉంటుంది. ఆ ప్రకాశము శరీరములో ఉన్న దేవతలందరికీ కూడా తిన్న ఆహారము పచనము చేసి యజ్ఞవేదిలోకి హవిస్సు వేసినట్లుగా పడేట్లు చేస్తుంది. అందుకే తినే ముందు స్వాహాకారము చెపుతారు. లోపల పుచ్చుకున్న పదార్ధమును చిన్న అగ్నిహోత్రములా ఉన్న అమ్మవారు జీర్ణము చేసి ప్రధానదేవతకు నైవేద్యమయిన తరవాత ఉప దేవాలయములోకి అందినట్టు మిగిలిన దేవతలకు అందేట్లుగా చేస్తుంది. ప్రధాన దేవతయిన అమ్మవారు శరీరములోనే ఉండి పరిపాలన చేస్తున్నది. ఇంద్రియములకు పుష్టి ఇస్తున్నది.

చండీయాగము చేస్తే ఈ మంత్రములతో అమ్మవారికి హవిస్సు ఇస్తారు. ఇవన్నీ అమ్మవారి అనుగ్రహముతో సరయిన దిశయందు ప్రచోదనము జరగాలని కోరుకుంటాము. శ్రీమహారాజ్ఞి నిరంతరము మంచివైపు కదుపుతు పరిపాలన చేస్తున్నది. ఎవరు తమకి ఉన్న శక్తిని సద్వినియోగము చెయ్యడము కోసమే పాటు పడతారో వారిని అమ్మవారు కీర్తిరూపములో ప్రకాశింపచేసి అనుగ్రహిస్తే వారు కీర్తిమంతులు అవుతారు. అహంకార పరిత్యాగము ఈ నామము బాగా ఉపయుక్తము అవుతుంది. ఏ విభూతి వలన ఏదిచేసినా, ఏ కదలికయినా ఆవిడ అనుగ్రహముతో కదిలింది. పై పట్టు అమ్మవారిదయి ఉండాలి. పట్టుకున్నప్పుడు సడలిపోకుండా లోపలిపట్టు గట్టిపడినంత కాలము పైకి ఎక్కడము జరుగుతూనే ఉంటుంది. దీనిని జాగ్రత్తగా తెలుసుకోగలగడమే శ్రీమహారాజ్ఞి అన్న నామమునకు ప్రధానమైన అర్థము.

మణిద్వీప వర్ణన


మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని

మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 ||

సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు

అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 ||

లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు

లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || 3||

పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు

గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || 4 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు

మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 ||

అరువది నాలుగు కళామతల్లులు వరలనోసగే పదారుశక్తులు

పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 ||

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు

సృష్టికర్తల సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 ||

కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు

కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు

ఏడామడల రత్న రాశులు మణిద్వీపానికి మహానిధులు || 9 ||

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు

ప్రపంచమేలే ప్రజాదిపతులు మణిద్వీపానికి మహానిధులు || 10 ||

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్య

పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు || 11 ||

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వ శుభప్రధ ఇచ్చాశక్తలు

శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 12 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మిలమిలలాడే ముత్యపు రాశులు తలతలలాడే చంద్రకాంతములు

విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 13 ||

కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు

భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 ||

భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచాశక్తులు

సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 ||

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్య కాంతి శిలమహాగ్రహాలు

ఆరుఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు || 16 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మంత్రిని దండినీ శక్తి సేనలు కాళీ కరాళి సేనాపతులు

ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 17 ||

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవీ పరిచారికలు

గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 18 ||

సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు

నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 19 ||

మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు

సృష్టిస్థితిలయకారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు || 20 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు

పదారు రేకుల పద్మ శక్తులు మణిద్వీపానికి మహానిధులు || 21 ||

దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు

దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 ||

శ్రీ విగ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు

మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు || 23 ||

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు

సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 24 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాశులు

వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 25 ||

దుఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు

ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు || 26 ||

పదనాల్గు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు

సర్వలోకమే ఈ మనిద్వీపం సర్వేశ్వరీకది శాశ్వతస్థానం || 27 ||

చింతామణుల మందిరమందు పంచాబ్రహ్మలు మంచముపైన

మహాదేవుడు భువనేశ్వరీ తో నివసిస్తాడు మనిద్వీపము లో || 28 ||

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం

మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి

సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మనిద్వీపము లో || 29 ||

పరదేవతను నిత్యము కొలిచిమనసర్పించి అర్చించినచో

అపారధనము సంపదలు ఇచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || 30 || (2)

నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు

చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు || 31 || (2)

శివకవితేస్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట

తిష్టవేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే కైవల్యం || 32 ||

భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 5

అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ |

య: ప్రయతి స మద్భావం యాతి నాస్త్వత్ర సంశయః ||

అర్థం :-

అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచుదేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును. ఇందేమాత్రముగూడ సందేహము లేదు.



పెరియవ తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు

ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామివారి భక్తుడొకరికి పెద్ద దుఃఖం కలిగింది. తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినబడుతూ ఉంటుంది. ఆ స్వరం ఏవేవో విషయాలన్నిటిని చెబుతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూ ఉండేది. ఎన్నో సార్లు ఆ బాధని భరించలేక నిద్రనుండి మేల్కొనేవాడు.



అది ఎవరి గొంతు? బహుశా ఆంజనేయ స్వామివారి గొంతు అనుకుని అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. చాలామంది తమ కష్టాలు తీర్చమని అతని ముందు వరుసలు కట్టడం మొదలుపెట్టారు. అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలుపెట్టారు. దాని కొరకు అతడు ఒక రోజు కేటాయించవలసి వచ్చింది. అతను కూడా ఎటువంటి ధనం ఆశించకుండా చెప్పేవాడు. కనుక అలా వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరగసాగింది.

అలా అడిగినవారికి అందరికి అతని చెవుల్లో వినబడే శబ్దాలను విని వాటిని చెప్పేవాడు. చివరగా అతను మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులాగా విలవిలలాడిపోయాడు.

“నన్ను కాపాడేవారెవరు?” అని భోరున విలపించాడు.

నా వద్దకు రా అన్నట్టుగా కనపడుతున్న మహాస్వామివారే తనను కాపాడగలరని తెలుసుకొని వారి పాదపద్మముల యందు శరణాగతిని వేడాడు. “నేనున్నాను. నావద్దకు రా” అని స్వామివారు భరోసా ఇచ్చినట్టు భావించాడు.

“పెరియవ తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు. నా చెవుల్లో ఎప్పుడూ ఏవో మాటలు వినబడుతున్నాయి. మొదట హనుమంతులవారే అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని అంచనాలు నిజం అయ్యాయి కూడా కాని మొత్తానికి నేను మనఃశాంతిని కోల్పోయాను. నాకు ఇక ఉత్తరభారతంలో ఉండడం ఇష్టం లేదు. నాకు ఎలాగైనా బదిలీ కావాలి. దయచేసి నాపైన మీ కరుణను ప్రసారించండి పెరియవ” అని వేడుకున్నాడు.

“ఇవన్ని నాకెందుకు చెబుతున్నావు? నీకు ఆంజనేయ స్వామి వారి ఆశిస్సులు ఉన్నాయి కదా? మరి ఆంజనేయ స్వామికే ఎందుకు చెప్పుకోకూడదు?” అని స్వామివారు నవ్వుతూ అన్నారు.

అతను చాలా సిగ్గుపడ్డాడు. “పెరియవ నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయ స్వామివారిది అని అనుకున్నాను. అది ఎ దయ్యమో నాకు తెలియదు. నన్ను నిద్రపోవడానికి కూడా వదలడం లేదు. అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను. నేను ఏమి మాట్లాడకపోయినా ఏవో పనికిమాలిన విషయాలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. పెరియవ రక్షించండి”

“ఎప్పుడూ రామ నామం జపిస్తూ ఉండు. కుంబకోణం దగ్గరలోని గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది. అక్కడకు వెళ్లి కొన్నిరోజులపాటు ఉండు” అని ఆదేశించి ప్రసాదం ఇచ్చి పంపించారు.

పదిరోజుల తరువాత ఆ భక్తుడు గోవిందపురం నుండి వచ్చాడు. అతని మొహం సంతోషంతో వెలిగిపోతోంది. పరమాచార్య స్వామికి సాష్టాంగం చేశాడు.

“ఏమిటి? ఆంజనేయస్వామి వారు రామ సేవకు వెళ్లిపోయారా?” అని కొంటెగా అడిగారు. గోవిందపురం వెళ్ళగానే తాని బాధ తీరిపోయింది. ఇక ఎప్పుడూ ఆ గొంతు అతనికి వినబడలేదు. భగవంతుని నామాన్ని నిరంతరమూ జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైన ఆలోచనలు, మాటలు ఇక వినబడవు. పొరపాటున విన్నా అవి మన మనస్సుకి చేరి మనః శాంతిని పోగొట్టవు.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్|

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

శ్రీ లలిత సహస్రనామావైభవం 1

శ్రీమాతా

‘శ్రీమాతా’ – అంటే మంగళప్రదురాలైన అమ్మా! అని అర్థము. గుర్తు పట్టవలసిన విషయము లోకములో ఉన్న ఏకైక సంథానమయిన అమ్మ అన్నమాటకు పరిచయము లేదు. కడుపులో ఉండగా నాభీగొట్టముతో ప్రారంభమైన అనుబంధము బయటికి వచ్చాక తెగిపోతుంది. హృదయసంబంధము అలాగే ఉంటుంది. అమ్మ అంటే పోషణ – రక్షణ – మంగళము. అమ్మలేకపోతే సృష్టి ఆగిపోతుంది. అమ్మవారి సృష్టిశక్తి, మాతృత్వము ఒక పురుష వీర్యమును స్త్రీ శరీరము పుచ్చుకునేట్టుగా నిర్మాణము చేయడములో ఉన్నది. ఆ తల్లి అనుగ్రహముతో పిల్లవాడు పూర్తిగా తయారు అయ్యేవరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడకుండా, తల్లి శరీరము పిగిలిపోకుండా, మళ్ళీ పిల్లవాడు బయటికి వచ్చాక సంకుచితమవ్వాలి. ఇంతమంది జన్మించడానికి స్త్రీ ఉపాధుల యందు అంత మార్పుతో నిర్మాణము చేసి, లోపల పసిగుడ్డును కాపాడి జాగ్రత్త చేసింది శ్రీమాత. కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే అమ్మ స్తన్యములో కోలోస్ట్రం అనే పసుపు పచ్చని ముద్ద ఒకటి ఊరుతుంది. ఏమీ తెలియని వాడిని జగన్మాత ఆవహించి ‘ నీ పోషణకోసము, రక్షణకోసము మీ అమ్మ స్తన్యములయందు నేను ప్రకాశిస్తున్నాను’ అని చెపుతుంది. అమ్మ స్తన్యములలో ఊరిన ఆ పదార్థమును పిల్లవాడు చప్పరిస్తే లోపలున్న ఊపిరితిత్తులు, జీర్ణాశయము అన్నీ పనిచేస్తాయి. కడుపులో ఉండగా నల్లటి మలము గడ్డలుగా పెరుగుతుంది. దానిని బయటికి పంపడము ఎవరికీ సాధ్యముకాదు. కోలోస్ట్రం మ్రింగగానే నల్లటి మలము బయటికి వెళ్ళిపోతుంది. మలినములు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అమ్మ కడుపులో, పక్కలో దూరి పడుకోవడములో పిల్లవాడు ఎంతో భద్రత అనుభవిస్తాడు. ఆ అమ్మతనము అంతా హృదయము పరవశించిపోయే శ్రీమాతాతత్త్వము. అమ్మవారి వంకచూసి ‘శ్రీమాతా’ అని పిలవడానికి భయపడనవసరము లేదు. ఉపాసన చేయడానికి నియమ నిబంధనలు లేవు. అమ్మగా అమ్మవారిని చూడాలి. అమ్మని ఒక మొగవాడిగా చూస్తే దోషము. ఏ అమ్మా క్షమించదు. కొడుకుగా నిలబడి నమస్కారము చేస్తే ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ఆవిడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త గర్భాలయము ఇచ్చింది, పాలు పట్టింది, (స్వల్పకాలికలయము) నిద్రపుచ్చింది. ముగ్గురూ అమ్మలో ఉన్నారు కనక మొదటి దైవము అమ్మ. భగవంతుడు ఒక్కడే అయినా కర్తవ్యనిష్ఠ కలిగినప్పుడు బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రునిగా మూడురూపములతో ప్రకాశిస్తాడు. శ్రీమాత ఈ ముగ్గురూ మూడురకములైన కార్యములను నిర్వహించడానికి మూడురకములైన శక్తులను ఇచ్చింది. ఉపనిషత్తు – ‘యతోవా ఇమాని భూతాని జాయన్తి ’ అంటుంది. దేనినుండి సమస్తము ఉత్పన్నము అయినదో – ‘దేనినుండి’ అన్నమాట ఏది ఉన్నదో అదే అమ్మవారు. దేనినుండి సమస్తము పుట్టాయో అన్న ఉపనిషత్ వాక్యము మారిస్తే అదే శ్రీమాత. అన్ని ప్రాణులను సృజించుట వెనక అమ్మదయ ఉన్నది. శ్రీమాత ఎవరు? అన్న విషయము జాగ్రత్తగా అవలోకనము చేస్తే ‘శ్’ ‘ర్’ ‘ఈ’ అన్న మూడు అక్షరములు కలిస్తే ‘శ్రీ’ అవుతుంది. ఆ మూడూ సత్త్వ, రజ, తమో గుణములను చూపిస్తాయి. లోకమంతా వీటిలోనే ఉన్నది. ఇవి బయటికి రాకుండా కలసిపోయి అవ్యక్తమైపోయి ఒక దానిలోకి వెళ్ళి ఉండిపోతే ‘శ్’ ‘ర్’ ‘ఈ’ కలసి శ్రీ – కలసిపోయి మాత – ఆవిడలోకి వెళ్ళిపోతాయి. సృష్టికి ముందర ఆవిడ ఒక్కత్తే ఉన్నది. ఆమెను పూర్వజా అంటారు. ఆవిడలో ఉన్న మూడుగుణములు ఆవిడలోనుంచే పైకి వచ్చాయి. ఈ మూడుగుణములు తీసి శుద్ధసత్త్వము ఆమెయే ఇవ్వాలి. అమ్మా! ఈ గుణముల వలన లోపలనుండి కలిగే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యములన్న శత్రువులు అని గుర్తించి ఆవి ఉండటము వలన బాధ, కష్టము కలుగుతున్నాయి అమ్మా! అని నిజాయితీగా అంటే చాలు అమ్మవారు ఆ మూడూ ఉపసంహారము చేసి బాధలను తీర్చేస్తుంది. భాస్కరరాయలవారు అంటారు -- ‘లోకములో ఒక తల్లికీ తండ్రికీ జన్మించిన బిడ్డడు అమ్మా! అనే పిలుస్తాడు. బిడ్డడిని విడచి ఉండమంటే ఏ తల్లీ అంగీకరించదు. నేను వేరొకజన్మ లేకుండా చేసుకోవడానికి తురీయాశ్రమమునకు వెళ్ళిపోతాను అంటే అంగీకరించదు. శ్రీమాతా అని పిలిస్తే వేరొకజన్మలో అమ్మా! అని ఎవరినీ పిలవనవసరము లేని స్థితిలో మోక్షము ఇస్తుంది. శివజ్ఞానము ఇస్తుంది. ఆ జ్ఞానము కలగగానే పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితి పొందడము జరుగుతుంది.



రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...